కొబ్బరిచెట్లూరు సమీపంలో పట్టాలపై పడివున్న తల లేని మృతదేహం
కాశీబుగ్గ : పలాస మండలంలో కొబ్బరిచెట్లూరు గ్రామానికి సమీపంలో ఉన్న రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. పలాస రైల్వేస్టేషన్‌కు కూత వేటుదూరంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహం వద్ద మృతుడు తల లేకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. పరిసర ప్రాంతాలలో రైల్వే జీఆర్‌పీ సిబ్బంది వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇతడు రైలు నుంచి జారిపడ్డాడ, ఆత్మహత్య చేసుకున్నాడ, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది అంతుపట్టడం లేదు.
మృతుడికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని, చామన్‌ఛాయ రంగు కలిగి, 5.2 అడుగుల ఎత్తు ఉంటాడని రైల్వే పరిశోధన అధికారి కె.కోధండరావు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పలాస రైల్వే స్టేషన్‌ను సంప్రదించాలని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు జీఆర్‌పీ రైల్వే స్టేషన్ 08945 241013 నంబరుకు సంప్రదించాలన్నారు.
నౌపడ ఆర్‌ఎస్ వద్ద...
టెక్కలి రూరల్ : మండలంలోని నౌపడ ఆర్‌ఎస్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్‌పీ హెచ్‌సీ కోదండరావు తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం వేకువజామున రైల్వేట్రాక్ పక్కన ఒక మృతదేహం పడివుందనే సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 ఉంటుందని, అతనిచేతికి గోల్డ్ ఉంగరం, గీతల తెలుపురంగు షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఇతడి తల పూర్తిగా నుజ్జు అవ్వడంతో ఆత్మహత్య చేసుకుని ఉండిఉంటాడని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంతవరకు మృతదేహానికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలియలేదని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment