
శ్రీనివాస్ కోసం గాలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ,యువకుడు శ్రీనివాస్
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : స్నేహితులతో ఛాలెంజ్ చేసి పంతం కోసం ఆపకుండా ఈత కొట్టిన యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన నెలమంగల తాలూకా పరిధిలో చోటుచేసుకుంది. తుమకూరు శెట్టిహళ్లికి చెందిన శ్రీనివాస్ (25) నెలమంగల తాలూకా నందిహళ్లి వద్ద ఉన్న రిలయన్స్‌వేర్‌హౌస్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం నైట్ డ్యూటీ చేసి గురువారం ఉదయం ఆరుగురు స్నేహితులతో కలిసి హళేనిజగల్ చెరువులో ఈత కొట్టడానికి వెళ్లాడు.
ఈ సమయంలో ఎక్కువసేపు ఈత కొడతానని స్నేహితులతో ఛాలెంజ్ చేసి పంతానికిపోయి ఈతకొడుతూ అలసిపోయి నీట మునిగి పోయి మృతి చెందాడు. ఆ సమయంలో స్నేహితులు కూడా ఈత కొడుతున్నా వారు శ్రీనివాస్‌ను రక్షించే ప్రయత్నం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చాలదన్నట్టు శ్రీనివాస్ నీట మునిగే దృశ్యాలను ఒక స్నేహితుడు తన మొబైల్‌లో వీడియో తీశాడు. సమాచారం అందుకుని ఘటనాస్ధలానికి వచ్చిన కుటుంబ సభ్యులు శ్రీనివాస్‌కు నీళ్లంటే భయమని ఈత కూడా వచ్చేదికాదని శ్రీనివాస్‌ను ఎవరో కావాలని నీటిలో తోసి హత్య చేసారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది చెరువులో మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకున్న దాబస్‌పేట పోలీసులు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment