భార్య పోరు పడలేక.. ఏటీఎం క్యాష్‌ చోరీ | Man Held in CMS Cash Vehicle Stolen Case Hyderabad | Sakshi
Sakshi News home page

ఇల్లుకని కొల్లగొట్టాడు!

Published Fri, Mar 20 2020 8:33 AM | Last Updated on Fri, Mar 20 2020 8:33 AM

Man Held in CMS Cash Vehicle Stolen Case Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: డిప్లమో పూర్తి చేసిన అతగాడు సివిల్‌ ఇంజినీర్‌గా సిటీకి వచ్చాడు.. వివిధ సంస్థల్లో పని చేసినా భార్య అంగీకరించకపోవడంతో మానేశాడు.. భారీ చోరీ చేసి స్వస్థలంలో ఇల్లు కట్టుకుని సెటిల్‌ అవుదామని పథకం వేశాడు.. దీనికోసం కారు డ్రైవర్‌ అవతారం ఎత్తి సీఎంఎస్‌ వాహనం ‘చేజిక్కించుకున్నాడు’.. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన రూ.92 లక్షలు ఎత్తుకుపోయాడు.. ఈ పంథాలో చోరీకి పాల్పడిన దొండపాటి ప్రకాశ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.90 లక్షలు రికవరీ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు.

భార్య పోరు పడలేక..   
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన ప్రకాశ్‌ కాకినాడలో సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లమో చేశాడు. ఆపై అనేక ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసిన ఇతగాడు తన విధుల్లో భాగంగా ఏపీతో పాటు మధ్యప్రదేశ్, తమిళనాడుల్లోనూ ఉండి వచ్చాడు. 2015లో ప్రేమ వివాహం చేసుకున్న ఇతగాడు రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతూ ఉద్యోగాలు చేయడానికి భార్య అంగీకరించలేదు. దీంతో బతుకుదెరువు కోసం 2017లో నగరానికి వచ్చి నాగోల్‌ సమీపంలోని సాయినగర్‌లో స్థిరపడ్డాడు. ఇప్పటికీ తన స్నేహితులు, బంధువులకు తాను సివిల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పుకొంటూ స్వస్థలంలోని ఇంటి ద్వారా వచ్చే అద్దెతో బతికేస్తున్నాడు. ఓ భారీ చోరీ చేయడం ద్వారా స్వస్థలంలోని ప్లాట్‌లో ఇల్లు కట్టుకుని సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం డూప్లెక్స్‌ ఇంటి ప్లాన్‌ సైతం సిద్ధం చేసుకుని తన స్మార్ట్‌ఫోన్‌లో భద్రపర్చుకున్నాడు. 

క్యాష్‌ నింపే వాహనాలే ఎంచుకుని..
ఎక్కడ చోరీ చేయాలనే విషయంలో అనేక ఆలోచనలు చేసిన అతగాడు ఏటీఎం కేంద్రాల్లో క్యాష్‌ నింపే బాధ్యతలు నిర్వర్తించే వాహనాలైతే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. అలా చేయడానికి ఆ వాహనం చేజిక్కించుకునే అవకాశం సంపాదించడం, వారి కార్యకలాపాలు తెలుసుకోవడం అవసరమని భావించాడు. దీంతో పథకం ప్రకారం గత ఏడాది ఆగస్టులో కవాడిగూడకు చెందిన ఫైవ్‌స్టార్‌ ఫ్యాకల్టీ సొల్యూషన్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మ్యాన్‌పవర్‌ కన్సల్టెన్సీలో డ్రైవర్‌గా చేరాడు. దీని ద్వారా ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే దోమలగూడలోని ఎస్‌ఐపీఎల్‌ సంస్థలోకి డ్రైవర్‌గా వెళ్లాడు. ఇటీవల ఈ సంస్థ మరో క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ సీఎంఎస్‌లోకి విలీనమైంది. దీంతో మూడుసార్లు సీఎంఎస్‌ క్యాష్‌ వాహనాలకు డ్రైవర్‌గా వెళ్లిన అతగాడు వాటి పూర్తి కార్యకలాపాలను తెలుసుకున్నాడు. నేరం చేయడానికి సిద్ధమైన ప్రకాశ్‌ తన భార్యను ఆమె సొంతూరు చాగల్లుకు పంపించాడు. 

సోమవారమే సో బెటర్‌గా..
క్యాష్‌ నింపే వాహనాలకు వారంలో మొదటి పని దినమైన సోమవారం భారీ డిమాండ్‌ ఉంటుంది. ఆ రోజు దాదాపు ప్రతి ఏటీఎంలోనూ డబ్బు నింపాల్సి వస్తుంది. ఆ రోజు ఉండే హడావుడి నేపథ్యంలో నిర్వాహకులు ఏ విషయాన్నీ పూర్తిగా సరిచూసుకోరు. ఈ విషయం తెలిసిన ప్రకాశ్‌ సోమవారం రంగంలోకి దిగాడు. పథకం ప్రకారం ఇంటి నుంచి బయలుదేరేప్పుడే తన సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. డబ్బు నింపుకోవడానికి ఓ బ్యాగ్‌ కూడా ఇంటి నుంచే తెచ్చుకున్నాడు. రోజూ మాదిరిగా ద్విచక్ర వాహనంపై కాకుండా ఆ రోజు బస్సులో బయలుదేరాడు. నేరుగా ముషీరాబాద్‌లోని సీఎంఎస్‌ క్యాష్‌ వాహనాల పార్కింగ్‌ స్థలంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న వాహనాల్లో గతంలో తాను డ్రైవ్‌ చేసిన (ఏపీ16 టీడీ 4451) బొలేరోను గుర్తించాడు. సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి తన పేరు రాకేశ్‌గా ఫైవ్‌స్టార్‌ సంస్థ తరఫున సీఎంఎస్‌లో ‘4451’ వాహనానికి డ్రైవర్‌గా వచ్చానని చెప్పాడు. ఆ రోజు మొత్తం 90 వాహనాలను పంపాల్సి ఉండటంతో ఆ హడావుడిలో ఉన్న సెక్యూరిటీ గార్డు వివరాలు సరిచూసుకోకుండా దాని తాళం ఇచ్చేశాడు. 

యూ టర్న్‌ పేరుతో ఉడాయింపు..
ఈ వాహనంతో లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని సీఎంఎస్‌ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి ఉద్యోగులు ఇద్దరు కస్టోడియన్లు, ఒక గన్‌మన్‌ను ఈ వాహనానికి కేటాయిస్తూ రూ.1.6 కోట్ల నగదు ఇచ్చారు. వీరికి కోఠిలోని ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచ్‌ నుంచి ఈసీఐఎల్‌ మధ్య ఉన్న ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే పని అప్పగించారు. వాహనంతో బయలుదేరే ముందు తలకు టోపీ పెట్టుకున్న ప్రకాష్, ముఖం సైతం కనిపించకుండా వస్త్రం చుట్టుకున్నాడు. అంతా కరోనా ఎఫెక్ట్‌ కారణంగా జాగ్రత్తలు తీసుకున్నాడని భావించి ప్రశ్నించలేదు. వాహనం చిలకలగూడకు చేరుకున్న తర్వాత అక్కడి ఏటీఎంలో రూ.68 లక్షలు నింపడానికి కస్టోడియన్లు వెళ్లారు. కారు దగ్గరే ఉన్న గన్‌మన్‌తో యూ టర్న్‌ చేసుకుని వస్తానని చెప్పిన ప్రకాశ్‌ మిగిలిన రూ.92 లక్షలతో ఉడాయించాడు. అక్కడ నుంచి మెట్టుగూడ, తార్నాక మీదుగా లాలాగూడ ఫ్లైఓవర్‌ వద్దకు చేరుకున్నాడు. నగదు మొత్తం బ్యాగ్‌లో నింపుకొన్న అతగాడు అక్కడ వాహనాన్ని వదిలి ఆటోలో సాయినగర్‌కు వెళ్లాడు. తన ఇంటికి కిలోమీటరు దూరంలో దిగి ఆటోడ్రైవర్‌కు రూ.200 ఇచ్చి వెళ్లిపోయాడు.

చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌...
సీఎంఎస్‌ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకోవడానికి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్‌ రంగంలోకి దిగారు. దాదాపు 28 మందితో కూడిన బృందం 500 సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేసింది. లాలాగూడ ఫ్లైఓవర్‌ వద్ద సీఎంఎస్‌ వాహనం వదిలిన ప్రకాశ్‌ ఆటోలో వెళ్లడాన్ని గుర్తించింది. ఆ ఆటోడ్రైవర్‌ షేక్‌ హమీద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సాయినగర్‌లో నిందితుడు ప్రకాశ్‌ ఆటో దిగినట్లు తేలింది. ఆ ప్రాంతంలో ఉన్న 600 ఇళ్లను స్థానికులైన ఏడుగురి సాయంతో టాస్క్‌ఫోర్స్‌ గాలించి ప్రకాశ్‌ ఇంటిని గుర్తించింది. ఆ ఇంట్లో సగం సామాను సర్దేసి ఉండటంతో మళ్లీ వస్తాడనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో కాపుగాశారు. సోమవారం తెల్లవారుజామున నగదు బ్యాగ్‌తో వచ్చి చిక్కాడు. చోరీ చేసిన మొత్తం నుంచి నిందితుడు రూ.2 లక్షలు అప్పులు తీర్చేయగా.. మిగిలిన రూ.90 లక్షలు రికవరీ చేశారు. కేసును కొలిక్కి తేవడంలో సహకరించిన ఆటోడ్రైవర్, సాయినగర్‌ వాసుల్ని కొత్వాల్‌ అంజనీకుమార్‌ సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement