
పోలీసుల అదుపులో నిందితులు
దుండిగల్: ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్దరు వ్యక్తులను దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఏసీపీ నర్సింహరావు, సీఐ వెంకటేశం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూరారం కాలనీ2 భవానీ నగర్‌కు చెందిన ఎం.డి.షకీర్ ఎలక్ట్రిషీయన్‌గా పని చేసేవాడు. సంగారెడ్డి రాంనగర్‌కు చెందిన సాయి విక్రమ్ సెంట్రింగ్ పనులు చేస్తూ షకీర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. చెడు వ్యసనాలకు బానిసైన వీరు సులువుగా డబ్బులు సంపాదించడానికి ఏటీఎం ను కొల్లగొట్టాలని నిశ్చయించుకున్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 12న రాత్రి సూరారం ఓం జెండా సమీపంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో చోరీ చేసేందుకు వెళ్లగా జన సంచారం ఉండడంతో విరమించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సూరారం కాలనీ లాస్ట్‌బస్టాప్ సమీపంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్దకు వెళ్లారు. ఏటీఎం మెషిన్‌ను తొలగిస్తుండగా ఓ వ్యక్తి అక్కడికి రావడంతో భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఏటీఎం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులు షకీర్, సాయి విక్రమ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment