హుస్సేన్ బిన్ అహ్మద్ సాదీ మృతదేహం, హుస్సేన్ బిన్ అహ్మద్ సాదీ (ఫైల్)
పహాడీషరీఫ్: స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బార్కాస్, సలాల ప్రాంతానికి చెందిన హుస్సేన్ బిన్ అహ్మద్ సాదీ(30), ఇదే ప్రాంతానికి చెందిన చాంద్ వహ్లాన్, అలీనగర్‌కు చెందిన ఇఫ్తేకార్ స్నేహితులు. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. చాంద్ వద్ద అజీజ్ అనే యువకుడు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.గత కొద్ది నెలలుగా హుస్సేన్ అతడిని దూషిస్తున్నాడు. దీంతో అజీజ్ అతనిపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి నలుగురు కలిసి ఇఫ్తేకార్ ఇంట్లో విందు చేసుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగి గొడవకు కారణమైంది. దీంతో ఆగ్రహానికి గురైన అజీజ్ ఓడ్కా బాటిల్‌తో హుస్సేన్ తలపై మోదగా, చాంద్, ఇఫ్తేకార్ అతడిపై కుక్కర్ మూత, గ్రానైట్ రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందడంతో వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ వి.సైదులు, ఎస్సై నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మృతుడు హిజ్రా హత్య కేసులో నిందితుడు...
చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారన్న వదంతుల నేపథ్యంలో గత ఏడాది మే 26న చాంద్రాయణగుట్టలో హిజ్రాను హత్య చేసిన కేసులో మృతుడు హుస్సేన్ బిన్ అహ్మద్ సాదీ 5వ నిందితుడిగా ఉన్నాడు. హోటల్‌లో భిక్షాటన చేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర మండలం, బండమీదిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య, మరో ఇద్దరు హిజ్రాలను వెంటాడి గ్రానైట్ రాళ్లతో దాడి చేయడంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందగా...మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం హుస్సేన్ కూడా రాళ్లతో జరిగిన దాడిలోనే మృత్యువాత పడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment