
శ్రీనివాసులు మృతదేహం(ఇన్‌సెట్) తల్లి మల్లమ్మ ఫైల్
గుంతకల్లు రూరల్: తిరిగిరాని లోకాలకు వెళ్లిన అమ్మను తలచుకుంటూ తిండీ తిప్పలు మానేసిన కొడుకు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక సంఘటన గుంతకల్లులో జరిగింది. వివరాల్లోకెళితే... గుంతకల్లు పట్టణం సత్యనారాయణపేట కాలనీలో లక్ష్మణ్ణ, మల్లమ్మ పతులకు ముగ్గురు సంతానం. లక్ష్మణ్ణ కులవృత్తి (ఇస్త్రీ), మల్లమ్మ పాచిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కూతురు రామాంజినమ్మ, కుమారుడు రామాంజనేయులుకు వివాహాలు చేశారు. వివాహానంతరం పెద్ద కుమారుడు రామాంజనేయులు వేరు కాపురం పెట్టాడు. కొంత కాలం తర్వాత భార్య, చిన్నకుమారుడితో గొడవపడి లక్ష్మణ్ణ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఇక అప్పటి నుంచి చిన్నకుమారుడు శ్రీనివాసులు (25) బాధ్యత తల్లి మల్లమ్మపై పడింది. బేల్దారిపనులు చేసుకుంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్న శ్రీనివాసులు చెడు అలవాట్లకు, మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మల్లమ్మ కామెర్లబారిన పడింది. సరైన వైద్యం చేయించుకోకపోవడంతో 20 రోజుల కిందట మృతి చెందింది. తల్లి మృతితో మనస్తాపానికి గురైన శ్రీనివాసులు తిండీ తిప్పలు మానేశాడు. మద్యం మత్తులో తూలుతూ ఇంటి వద్దే ఉండిపోయేవాడు. తల్లి లేని లోకంలో జీవించలేననుకున్న శ్రీనివాసులు సోమవారం రాత్రి తమ ఇల్లు, పొరుగిల్లు బాత్రూమ్‌ల మధ్య పొడవాటి చెక్కను ఉంచి.. దానికి నైలాన్ తాడు బిగించి ఉరి వేసుకున్నాడు. తన తల్లి ఫొటోను చేతిలో పట్టుకుని ఉరితాడుకు వేలాడుతున్న శ్రీనివాసులును మంగళవారం ఉదయం కాలనీవాసులు గుర్తించారు. కసాపురం ఎస్‌ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అమ్మతనంలో కమ్మదనం..అమ్మ
చంటిబిడ్డకు వెచ్చదనం..అమ్మ
ఆలనాలాలన చిలిపితనంలో..అమ్మ
చిరునవ్వుకు చిరునామా..అమ్మ
పుట్టుకకు మూలం..అమ్మ
ప్రేమకు ప్రతిరూపం ..అమ్మ
రూపానికి ప్రతిబింబం..అమ్మ
మమకారంలో అమ్మ
ముద్దూమురిపెంలో అమ్మ
వెన్నలాంటి మంచి ‘మనిషి’లో.. అమ్మ
రూపమేదైనా అమ్మే..అమ్మ
ఎక్కడలేదు అమ్మ..
కల్మషంలేని అమ్మ
అమ్మలో అసూయలేదు ..
కోపంలో అయినా.. కరుణలో అయినా
అడుగులో అయినా..ఆకలిలో అయినా..
ఆప్యాయతలో అయినా..ఆత్మీయతలో అయినా..
అన్నింటా కల్మషంలేనిది అమ్మ..
ఎన్ని జన్మలకైనా సాటిలేనిది అమ్మ
‘ప్రత్యామ్నాయం’దొరకనిది అమ్మ..
తనయుడిని కంటికి రెప్పలా పెంచిన తల్లి కన్ను ఆర్పింది.
‘అమ్మ’లేదని..అమ్మనుతలుచుకుంటూ ‘రూపం’..‘తల్లి’డిల్లింది.
జీవితం ఇక వద్దు అని..‘జన్మ’చాలని తనువు చాలించింది.