వృద్ధురాలి మృతదేహం ఉన్న చెత్తకుండి
ఆతనో ఆలయ పూజారి.. చాలీచాలని ఆదాయంతో బతుకు బండిని లాగిస్తున్నాడు. వృద్దురాలైన తల్లి ఆతని వద్దే ఉంటోంది. ఇంతలో హఠాత్తుగా అనారోగ్యంతో తల్లి మృతి చెందింది.ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి అతడి వద్ద డబ్బులు లేవు. దిక్కుతోచని స్థితిలో గుండెని రాయి చేసుకుని తల్లి మృతదేహాన్ని చెత్తకుప్పలో వేశాడు. కనీసం అలా అయిన పారిశుద్ధ్య సిబ్బంది తీసుకుని వెళ్లి పాతిపెడతారని ఆ అభాగ్యుడు భావించాడు. హృదయవిదారకమైన ఈ సంఘటన తూత్తుక్కుడిలో చోటుచేసుకుంది.
చెన్నై, అన్నానగర్: తూత్తుక్కుడిలో సోమవారం కన్న తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చెయ్యలేక ఆమె కుమారుడే చెత్త కుప్పలో విసిరేశాడు. తూత్తుక్కుడి ధనశేఖరన్‌నగర్ ప్రాంతంలో చెత్తకుండిలో ఉన్న వ్యర్థాలను సేకరించటానికి సోమవారం కార్మికులు అక్కడికి వచ్చారు. అప్పుడు చెత్తకుండికి పక్కన చెల్లాచెదరుగా పడి ఉన్న చెత్త వ్యర్థాల్లో ఓ మహిళ మృతదేహం ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే వారు సిబ్‌కాట్ పోలీసుస్టేషన్‌కి సమాచారం అందించారు. పోలీసుల విచారణలో తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి డబ్బు లేకపోవటం వలన ఆమె కుమారుడే చెత్త కుప్పలో విసిరేసినట్లు తెలిసింది. మృతురాలి పేరు వసంతి (50). ఈమె భర్త నారాయణ స్వామి. వీరికి ముత్తు లక్ష్మణన్ (29) అనే కుమారుడు ఉన్నాడు.
నారాయణ స్వామి కొన్ని సంవత్సరాల క్రితం చెన్నైకి వెళ్లి అక్కడ ఉన్న ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. వసంతి తన కుమారుడు ముత్తు లక్ష్మణన్ వద్ద ఉంటూ వచ్చింది. ముత్తు లక్ష్మణన్ ఆలయ పూజారిగా ఉన్నాడు. అంతంత మాత్రం ఆదాయంతో కఠిన పేదరికంలో నివశిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో వసంతి అనారోగ్యంతో ఆదివారం రాత్రి హఠాత్తుగా మృతి చెందింది. తల్లికి అంత్యక్రియలు చెయ్యటానికి డబ్బులు లేకపోవడంతో ముత్తు లక్ష్మణన్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తర్వాత మనస్సుని రాయి చేసుకుని తన ఇంటికి సమీపంలో ఉన్న చెత్తకుండి పక్కన తల్లి మృతదేహం విసిరేస్తే కార్పొరేషన్ కార్మికులు తీసుకుని వెళ్లి పాతిపెడతారని భావించి తల్లి మృతదేహాన్ని అక్కడ విసిరేశాడు అని పోలీసుల విచారణలో తెలిసింది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు తూత్తుక్కుడి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి అతని కుమారుడికి అప్పగించారు. తర్వాత కొద్ది మంది దాతల సహాకారంతో అంత్యక్రియలు నిర్వహించాడు లక్ష్మణన్.
Comments
Please login to add a commentAdd a comment