
అమూల్య (ఫైల్)
పెళ్లయి ఏడేళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపానికి లోనైన అమూల్య ఈ నెల 11న రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
మియాపూర్: సంతానం కలగడం లేదని ఓ మహిళ మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారంచోటు చేసుకుంది. ఎస్‌ఐ రఘురాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపజిల్లా, దేవగూడి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మీదేవి, ఓబుల్‌రెడ్డి దంపతుల కుమార్తె అమూల్య(29)కు ప్రొద్దుటూర్ పట్టణానికి చెందిన రామలింగేశ్వర్‌రావు 2012లో వివాహం జరిగింది. అమూల్య స్కూల్‌లో క్లర్క్‌గా పని చేస్తుండగా, రామలింగేశ్వర్ రావు బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
గత నాలుగేళ్లుగా వీరు మియాపూర్‌లోని గోపాల్‌రావునగర్‌లో నివాసముంటున్నారు. పెళ్లయి ఏడేళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపానికి లోనైన అమూల్య ఈ నెల 11న రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన ఆమె భర్త రామలింగేశ్వర్‌రావు అపస్మారక స్థితిలో ఉన్న అమూల్యను కిందకు దింపి కూకట్‌పల్లిలోని అనుపమ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.