మృతురాలు గాయత్రి
పెందుర్తి: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం 69వ వార్డు వేపగుంట దరి అప్పలనర్సయ్య కాలనీలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అప్పలనర్సయ్యకాలనీలో నివసిస్తున్న పూడి శ్రీనుబాబునాయుడు నేవల్ డాక్‌యార్డులో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి 72వ వార్డు శ్రీనివాసనగర్‌కు చెందిన పూడి గాయత్రి(26)తో 2010లో వివాహమైంది. వీరికి ఎనిమిది నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. ఇదిలా ఉండగా.. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఈ తరుణంలో గాయత్రి తండ్రి కర్రి పైడిరాజు మంగళవారం జరిగిన పైడితల్లి అమ్మవారి పండగకు అల్లుడిని, కూతురిని శ్రీనివాసనగర్‌లోని తన ఇంటికి ఆహ్వానించాడు. మంగళవారం రాత్రి గాయత్రిని, పిల్లలను పుట్టింటిలో వదిలి శ్రీనుబాబునాయుడు చెప్పాపెట్టకుండా వెంటనే వెళ్లిపోయాడు. ఇందేంటని విషయం తెలుసుకుని పైడిరాజు అల్లుడికి పలుమార్లు ఫోన్ చేశాడు.
ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అదేరోజు రాత్రి గాయత్రి కూడా పిల్లలను తీసుకుని తిరిగి వచ్చేసింది. బుధవారం ఉదయం భర్తకు భోజనం బాక్స్ కట్టి ఇచ్చింది. పిల్లలకు స్నానం చేయించింది. అనంతరం ఒంట్లో బాగోలేదని పనిమనిషికి చెప్పి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కొంత సేపటికి పిల్లలు ఏడుస్తుండడంతో పనిమనిషి తలుపు తట్టింది. ఎంతకీ తీయకపోయేసరికి పక్క గదిలో ఉన్న గాయత్రి మామకు విషయాన్ని చెప్పింది. ఆయన కూడా వచ్చి తలుపు తట్టాడు. తీయకపోవడతో విషయాన్ని శ్రీనుబాబుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. భర్త వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపల చూడగా చున్నీతో గాయత్రి ఉరి వేసుకుని కనిపించింది. కొనఊపిరి ఉన్నట్టు భావించి వెంటనే గాయత్రి తండ్రికి ఫోన్‌చేసి రప్పించాడు. పైడిరాజు వచ్చి వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని అప్పలనర్సయ్య కాలనీకి తీసుకొచి తన కుమార్తె మృతికి కారణం భర్త, మామ, కుటుంబీకులేనని పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పెందుర్తి సీఐ వెంకునాయుడు శవపంచనామా జరిపి గాయత్రి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసును దర్యాపు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలంలో ఇరు కుటుంబాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోస్టుమార్టం అనంతరం అప్పలనర్సయ్య కాలనీలో ఉన్న ఇంటికి మృతదేహాన్ని తీసుకురాగా ఆమె భర్తని, కుటుంబీకులను చూడనివ్వకుండా గాయత్రి బంధువులు అడ్డుకున్నారు. దీంతో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment