సాక్షి ప్రతినిధి, చెన్నై : ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెళ్లి ఎట్టకేలకూ ముందుకు వచ్చింది, అమ్మాయిని చూడొచ్చు, వివాహ మూహూర్తం పెట్టుకోవచ్చని హుషారుగా వెళ్లిన ఓ వ్యక్తిని ‘మీటూ’ పేరుతో నిలువుదోపిడీ చేసిన సంఘటన తమిళనాడులో జరిగింది.
చెన్నై ఆరంబాక్కంకు చెందిన కాళీచరణ్ (43) ప్రయివేటు కంపెనీ ఉద్యోగి. ఎన్నో ఏళ్లుగా సంబంధాలు చూస్తున్నా వధువు కుదరలేదు. దీంతో ఇటీవల ఆన్‌లైన్ ద్వారా ఒక మ్యాట్రిమోనియల్‌లో తన పేరును నమోదు చేసుకోగా ఒక అమ్మాయి ఫొటో చూసి ముచ్చటపడ్డాడు. బుధవారం ఒక అమ్మాయి ఫోన్‌చేసి తాను బెంగళూరులో ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నానని, నేరుగా కలవాలని అనుకుంటున్నానని చెప్పి చెన్నైలోని ఒక షాపింగ్ మాల్‌కు రమ్మంది.
మరికొంత సేపటికి అక్కడికి కాదు సంగం థియేటర్‌కు రమ్మంది. ఆ తరువాత మరలా ఫోన్‌చేసి చెన్నై వంద అడుగుల రోడ్డు సమీపం పొన్నమ్మాళ్‌వీధిలోని ఒక ప్రయివేటు అతిథి గృహానికి రమ్మంది. కొత్త బట్టలు, 2.50 సవర్ల బంగారు చైన్, అర సవర ఉంగరం వేసుకుని కాళీచరణ్ అక్కడకు చేరుకున్నాడు. అతిథిగృహం వద్ద ఒక మహిళ అతడిని ఆహ్వానించి మిద్దెపైకి తీసుకెళ్లింది. అక్కడున్న ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులం, మీపై ‘మీటూ’ ఫిర్యాదులున్నాయి, మీ ఇంటికి వస్తే పరువుపోతుందని ఇక్కడికి పిలిపించామని బంగారు వస్తువులు, ఐఫోన్, రెండు ఏటీఎం కార్డులు లాక్కున్నారు.అంతేగాక అతడిని బెదిరించి ఏటీఎం కార్డుల పిన్ నంబర్ కూడా తీసుకుని వెళ్లిపోయారు. ఊహించని ఈ సంఘటనతో బిత్తరపోయిన కాళీచరణ్ వడపళని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అతిథిగృహంలోని సీసీ టీవీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment