
గొలుసులతో తల్లిదండ్రులు బంధించిన బాలుడు
తొర్రూరురూరల్(పాలకుర్తి) : ఆడుతూ.. పాడు తూ.. అల్లరి చేయాల్సిన బాలుడు.. ఏడేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు.. ముద్దుముద్దుగా మాట్లాడాల్సి ఉండగా గొంతు మూగబోయింది. మాట్లాడడమే మానేశాడు. తల్లిదండ్రులతో సహా అందరినీ మరిచిపోయాడు. ఈ పరిస్థితుల్లో విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాడో.. ఎవరిని గాయపరుస్తాడో.. తెలియని పరిస్థితి.
అందుకే ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇనుప గొలుసులతో బంధించారు.తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన గజ్జి యాకయ్య, స్వరూప దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ మూడో సంతానంగా జన్మించిన సాంబరాజు మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడు.
ఏమైందో ఏమో నాలుగో ఏట మతిస్థిమితం కోల్పోయాడు. ఓ రోజు ఇంట్లో బట్టలు విప్పేసుకుంటూ, నేలపై పడి బొర్లడం చేస్తుండగా తల్లి గమనించి భర్తకు తెలియజేసింది. కొడుక్కు ఏదో వ్యాధి వచ్చిందని ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. కానీ వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏం వ్యాధో అంతకుచిక్కలేదు. అమెరికా తీసుకెళ్తే నయం అవుతుందని, లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు.
ఆర్థిక స్థోమత లేక స్వగ్రామానికి తిరిగి వచ్చారు. మతిస్థిమితం లేని బాలుడిని వదిలేస్తే ఎటైనా వెళ్లిపోతాడని, బాటసారులను గాయపరుస్తాడని ఏడేళ్లుగా చీకటాయపాలెంలోని తమ వ్యవసాయ భూమిలో గొలుసులతో కాళ్లను కట్టేసి ఉంచుతున్నారు. దాతలు ఎవరైనా స్పందించి ఆర్థికసాయం అందిస్తే తమ కుమారుడికి మెరుగైన వైద్యం చేయిస్తామని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
పింఛన్ కూడా లేదు..
గొంతు చచ్చుబడి, మనుషులను గుర్తించలేని ఈ మానసిక దివ్యాంగుడికి ఆసరా పింఛన్ రావడంలేదు. పేద తల్లిదండ్రులు పలుమార్లు అధికారుల కాళ్లావేళ్లా పడ్డా అధికారులు కనికరించలేదు. దీంతో పేద తల్లిదండ్రులు కూలీ నాలి చేసి మతిస్థిమితం లేని కుమారుడిని పోషిస్తున్నారు. కలెక్టర్ చొరవ చూపి పింఛన్ అందేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment