ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు, మృతురాలి ఫ్లెక్సీతో నానమ్మ
మానవమృగాల ఆకృత్యాలకు అడ్డులేకుండా పోతోంది. నడక నేర్వని చిన్నారుల నుంచి పండు ముసలమ్మల వరకు బలవుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా.. కఠిన శిక్షలు పడుతున్నా పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూనే ఉన్నారు. చిన్నారి శ్రీహితపై అత్యాచారం, హత్య ఘటనలో నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడి ఐదు రోజులు కూడా గడవక ముందే నగరంలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగు సంవత్సరాల బాలికపై ముగ్గురు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అవమాన భారం తట్టుకోలేక బాధితురాలు ఉసురు తీసుకుంది.
– భీమారం
సాక్షి, భీమారం(వరంగల్) : తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికపై కామాంధులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వరంగల్ నగరంలోని సమ్మయ్యనగరలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. నగరంలోని సమ్మయ్యనగర్‌కు చెందిన సిరిగిరి వెన్నెల(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి సారంగం మృతి చెందగా, తల్లి మరో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వెన్నెల పోషణ భారం నాన్నమ్మ చూసుకుంటోంది.
బైక్‌పై తీసుకెళ్లి..
శనివారం ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఓ చిన్నబాలుడిని ఇంటికి పంపి వెన్నెలను బయటకు పిలిచాడు. ఆ తర్వాత దగ్గరకు వెళ్లగానే బలవంతంగా బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వెన్నెల అపస్మారస్థితికి చేరుకుంది. రాత్రి సమయంలో మెలకువ వచ్చిన తర్వాత ఏం జరిగిందని వెన్నెల నానమ్మ అడగ్గా.. కొందరు మామిడి తోటకు తీసుకెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పాడు చేశారని విలపిస్తూ చెప్పిందని బాధితురాలి నానమ్మ వివరించింది.
అవమానం భరించలేక ఆత్మహత్య
ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బాలిక నానమ్మ పాల ప్యాకెట్‌కు బయటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి వెన్నెల చీరతో ఉరివేసుకుని విగతజీ విగా మారింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై హరికృష్ణ సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. వెన్నెల ఆత్మహత్యకు దారితీసి కారణాలపై ఆరా తీశారు. శనివారం ఇంటికి ఓ యువకుడు వచ్చి విషయాన్ని నానమ్మ వివరించింది. ప్రతిరోజు కొన్ని ఫోన్ నంబ ర్లతో కాల్స్ వచ్చేవని తెలపడంతో ఎస్సై ఆ నంబ ర్లకు ఫోన్ చేశారు. అనంతరం పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం కూడా నిందితుల నుంచి ఫోన్
ఇదిలా ఉండగా, ఆ యువకులు ఆదివారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో వెన్నెలకు ఫోన్ చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. రాత్రి కూడా ఫోన్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ..
సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీధర్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్ రాజు పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
రాత్రి వేళ పోస్ట్‌మార్టం
వెన్నెల మృతదేహానికి ఆదివారం రాత్రి పోస్ట్‌మార్టం నిర్వహించారు. రాత్రి 7.30 గంటల ప్రారంభమైన పోస్ట్‌మార్టమ్ రాత్రి 9.10 వరకు సాగింది.
కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వినయ్ పరామర్శ
మృతురాలి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే వినయభాస్కర్ పరామర్శించారు. సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
అత్యాచారానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు
వరంగల్ క్రైం: కాకతీయ యూనివర్సీటి పోలీసు స్టేషన్ పరిధి సమ్మయ్యనగర్‌కు చెందిన మైనార్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సరస్వతీ నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక తనతో చదివే బాలుడితో ఈనెల 10నద్విచక్ర వాహనం అంబాల రూట్లో వెళ్లినట్లు తెలిపారు. మార్గ మధ్యలో మరో యువకుడు తిరుపతి అదే వాహనంపై కలిసి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు సీపీ పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో చెదిరిన బట్టలతో బాలిక ఇంటికి రావడంతో కంగారుపడిన నాయనమ్మ విచారించగా తనతో చదువుకునే హసనపర్తి మండలం పెంబర్తికి చెందిన మైనర్ బాలుడుతో పాటు మరో యువకుడు గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు నాయనమ్మకు వివరించినట్లు సీపీ వివరించారు. ఆదివారం ఉదయం పాల కోసం బయటకు వెల్లిన నాయనమ్మ ఇంటికి వచ్చేసరికి బాధితురాలు ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుందని సీపీ తెలిపారు. మృతురాలి నాయనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment