మహ్మద్ షమీ, భార్య హసీన్ జహాన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భర్త షమీపై ఫిర్యాదు చేయగా మరో కేసు నమోదైంది. కుటుంబ పోషణ నిమిత్తం నెలవారీ ఖర్చుల కోసం లక్షల రూపాయలు, కుమార్తె అయిరాకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసేందుకు 5 లక్షల రూపాయాలు ఇవ్వాలని హసీన్ జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అలీపూర్ కోర్టులో గృహహింస చట్టం 2005 కింద మరో పిటిషన్ సైతం దాఖలు చేశారు జహాన్. 15 రోజుల్లోగా తాజా కేసుపై వివరణ ఇవ్వాలని భర్త షమీని, ఆయన కుటుంబ సభ్యులను కోర్టు ఆదేశించినట్లు సమాచారం.
షమీ భార్య హసీన్ జహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను చాలా కష్టాల్లో ఉన్నాను. గత నెల చివరి వారంలో షమీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లాను. షమీ మాత్రం నన్ను కలిసేందుకు ఇష్టపడలేదు. ఆ సమయంలో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. నేను ఎంతో మానసిక వేదన అనుభవించాను. చేతిలో డబ్బు లేకున్నా భర్త కోసం అతికష్టమ్మీద ఢిల్లీలో వారం రోజులు ఉన్నాను. కుటుంబం, కూతురు, ఇతరత్రా ఖర్చుల కోసం ఓవరాల్‌గా ప్రతినెలా 15 లక్షల రూపాయాలు షమీ ఇవ్వాలని’ భార్య హసీన్ డిమాండ్ చేశారు. గతంలో లక్ష రూపాయల చెక్కు ఇచ్చినా బౌన్స్ అయిందని తెలిపారు. కోట్లలో సంపాదించే షమీకి కుటుంబ పోషణను భరించడం ఓ లెక్కకాదని, అందుకే జహాన్ ఆ డబ్బు కోసం మరోసారి న్యాయ పోరాటానికి దిగారని ఆమె తరఫు లాయర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment