లక్నో : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ ఇంట్లో గొడవకు దిగిందన్న కారణంతో అతడి భార్య హసీన్ జహాన్‌ను అమ్రోహ పోలీసులు అరెస్టు చేశారు. తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టింది. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని సహాస్‌పూర్ అలీనగర్ గ్రామంలో ఉన్న షమీ ఇంటికి వెళ్లిన హసీన్.. అక్కడ అత్తింటి వాళ్లతో గొడవకు దిగింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందిగా వాళ్లు చెప్పడంతో కూతురితో సహా తనను తాను ఓ గదిలో బంధించుకుంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు షమీ ఇంటికి చేరుకుని హసీన్ జహాన్‌ను అరెస్టు చేశారు. అయితే కాసేపటి తర్వాత ఆమెను బెయిలుపై విడుదల చేశారు.
ఈ విషయం గురించి హసీన్ మాట్లాడుతూ.. ‘ నేను నా భర్త ఇంటికి వచ్చాను. ఇక్కడ ఉండేందుకు నాకు సర్వహక్కులు ఉన్నాయి. కానీ మా అత్తింటివాళ్లు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. నన్ను పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. నిజానికి పోలీసులు అరెస్టు చేయాల్సింది నన్ను కాదు వాళ్లను’అని పేర్కొంది. కాగా ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా బౌలర్ షమీ ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ అనంతరం మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం అతడు సన్నద్ధం కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment