కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫోన్ చేసి ‘నువ్వు, నీ భార్య కలిసున్న చిత్రాలు, వీడియోలు అశ్లీల వెబ్‌సైట్‌లో ఉంచుతాం’ అంటూ బెదిరించారు. ఆయన స్పందించకపోవడంతో ఆయన భార్య చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
సాక్షి, సిటీబ్యూరో: సార్... నా పేరు స్వాతి (పోలీసులు పేరు మార్చారు). పీజీ చదువుకుంటున్నాను. కొద్దిరోజుల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన విందులో పాల్గొని, అందరితో కలిసి ఫొటోలు తీసుకున్నాను. ఇటీవల నాకు నిశ్చితార్థమైంది.నా స్నేహితుడంటూ ఎవరో అపరిచిత వ్యక్తి నాకు కాబోయే భర్తకు ఆ ఫొటోలను పంపించాడు. నా ఫోన్ నంబరుసంపాదించి ‘నన్ను పెళ్లి చేసుకోకపోతే ఫలితం అనుభవిస్తావ్’ అంటూ బెదిరించాడు. అసభ్యకరమైన చిత్రాలకు నా ముఖాన్ని మార్ఫింగ్ చేసి వ్యాఖ్యలు రాశాడు. ఈ కారణంగా నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు. మా అమ్మానాన్న నచ్చజెప్పినా వినడం లేదు. నేను తప్పు చేయలేదని నిరూపించండి. సైబర్ క్రైమ్ పోలీస్ అధికారితో స్వాతి మొర ఇది. ఇలాంటి ఇబ్బందులు ఒక్క స్వాతికే పరిమితం కాదు. ఎంతో మంది విద్యార్థినులు, యువతులు, మహిళలకు ఎదురవుతున్నాయి. తమ చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని విశ్లేషించిన పోలీస్ అధికారులు అపరిచితులు పంపిన చిత్రాలు, పోస్ట్‌లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఈ తరహా కేసులు సైబరాబాద్, రాచకొండలో ఎక్కువవుతున్నాయి.
అపరిచితులతో స్నేహం వద్దు...
ఫేస్‌బుక్ ఖాతాలతోనే విద్యార్థినులు, యువతులు, మహిళలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన చిత్రాలు, వ్యాఖలకు ‘లైక్’ కొట్టడం ద్వారా ఇలా జరుగుతోందని వివరిస్తున్నారు. ఎప్పుడో స్నేహితులతో గడిపిన సందర్భాలు, దేవాలయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో చాలామంది విద్యార్థినులు పెళ్లికి ముందు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫేస్‌బుక్ ఖాతాల్లోకి ప్రవేశిస్తున్న నిందితులు, నేరగాళ్లు... యువతులు, విద్యార్థినులు లక్ష్యంగా చేసుకుని వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిందితుల్లో బాధితులకు తెలిసినవారు, అపరిచితులు ఉంటున్నారు. సోషల్ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఖాతాలున్న యువతులు, విద్యార్థినుల వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలను నేరగాళ్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
స్నేహితులు, బంధువులే ఎక్కువ
ఫేస్‌బుక్ ద్వారా వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది బాధితుల స్నేహితులు, బంధువులే ఉంటున్నారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ఈ వివరాలు వెల్లడవుతున్నాయి. ఫేస్‌బుక్ ఖాతాలున్న యువతులు, విద్యార్థినులు తమ వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. వీటిని నేరగాళ్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెబుతున్నారు. అవతలి వారు ఇష్టం లేదని చెప్పిన రెండు, మూడు రోజుల నుంచి వేధింపులు ప్రారంభిస్తున్నారు. స్నేహితులు.. కదా అనుకొని వారితో ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్లుంటే ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఉంచుతున్నారు. తల్లిదండ్రులకు చెబితే కొడతారన్న భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. వేధింపులు తీవ్రంగా మారినప్పుడు మాత్రం తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అపరిచితులు బ్లాక్‌మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బు తీసుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఎంచుకుంటున్నారు.
వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు పెట్టొద్దు
మాకొస్తున్న ఫిర్యాదుల్లో బాధితులు చాలామంది తమ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పెట్టిన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశారని అంటున్నారు. మేం³రిశీలిస్తే 50శాతం వరకు అలాంటివే. అందుకే విద్యార్థినులు, యువతులు... పార్టీలు, వేడుకలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫొటోలు, వీడియోలు దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని గుర్తించాలి. బంధువులు, స్నేహితులతో గడిపేటప్పుడు హద్దుల్లో ఉండండి. అపరిచితులతో ఫంక్షన్లకు వెళ్లడం, సినిమాలు, పార్టీలకు హాజరుకావడం వంటివి చేస్తే ఇబ్బందుల్లో పడతామనిగ్రహించండి. కళాశాలలు, కార్యాలయాల్లో జరిగే విషయాలను, ఇబ్బందికరంగా అనిపించినవి తల్లిదండ్రులకు తెలిపితే ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే పరిష్కరించుకోవచ్చు. – రోహిణి ప్రియదర్శిని, డీసీపీ,సైబరాబాద్ క్రైమ్స్
Comments
Please login to add a commentAdd a comment