తమిళనాడు, సేలం: ఆడపడచు ఆత్మహత్యకు కారణమంటూ భర్త తిట్టాడనే ఆవేదనతో పది నెలల కుమార్తెకు పురుగుల మందు తాపించి, ఆ తర్వాత తానూ తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సేలంలో బుధవారం చోటు చేసుకుంది. నామక్కల్ జిల్లా రాసిపురం సమీపంలోని వేపిల్లై కుట్టంకు చెందిన కూలీ కాట్టముత్తు (26). ఇతని భార్య కౌసల్య (20). వీరి కుమార్తె ప్రతీషా (10 నెలలు). కాట్టముత్తు చెల్లెలు ఇలవరసి కుటుంబ తగాదాల కారణంగా ఈ నెల 26వ తేదీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. ఆ సమయంలో తన చెల్లెలు మృతికి కౌసల్యనే కారణమంటూ భార్యను కాట్టముత్తు తిట్టాడు. దీంతో కౌసల్య తీవ్ర ఆవేదనకు గురైంది.
అంత్యక్రియలు ముగిసిన తర్వాత కౌసల్య తన కుమార్తె ప్రతీషాను తీసుకుని ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. తిరిగి తానే వస్తుందిలే అనుకుని కాట్టముత్తు ఉన్నాడు. అయితే రాత్రి పొద్దుపోయినప్పటికీ కౌసల్య ఇంటికి రాలేదు. దీంతో బుధవారం ఉదయం ఆమె కోసం గాలించగా, కౌసల్య, ఆమె కుమార్తె ప్రతీషా మృతదేహాలు సమీపంలోని దిమ్మనాయకంపట్టిలో ఉన్న మొక్కజొన్న తోటలో లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న మంగళంపల్లి పోలీసు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వారి మృత దేహాలను స్వాధీనం చేసుకుని శవ పంచనామా నిమిత్తం నామక్కల్ జీహెచ్‌కు తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ముందు ప్రతీషాకు పురుగుల మందు తాపించి, ఆ తర్వాత కౌసల్య కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment