
నిందితురాలు రాజలక్ష్మి
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందునే హత్య
అన్నానగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కుమార్తెను హత్య చేసిన తల్లిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నీలగిరి జిల్లా ఊటి సమీపం కోడప్పమందు అంబేడ్కర్ కాలనీకి చెందిన జగన్నాథన్ (40) పెయింటర్. ఇతని భార్య రాజలక్ష్మి (35). వీరి కుమార్తె ఉషారాణి (11). ఈమె ఊటీలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతూ వచ్చింది. అదే పాఠశాలలో రాజలక్ష్మి వంట సహాయకురాలిగా పని చేస్తూ వచ్చింది. రెండు సంవత్సరాల కిందట ఏర్పడిన అభిప్రాయబేధాల కారణంగా భార్యను విడిచి జగన్నాథన్, గాందలిలో ఒంటరిగా జీవిస్తూ వచ్చాడు. రాజలక్ష్మి తన కుమార్తెతో జీవిస్తోంది. ఈ స్థితిలో రాజలక్ష్మికి, పక్కింటికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇదిలాఉండగా బుధవారం రాత్రి తన కుమార్తె ఉషారాణి ఉయల ఊగుతుండగా తాడు గొంతుకు బిగుసుకుని మృతి చెందినట్లుగా స్థానికుల వద్ద తెలిపి బోరున ఏడ్చింది. అనంతరం ఉషారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఊటీ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఈ క్రమంలో జగన్నాథన్ సహోదరుడు కుమార్ ఉషారాణి మృతిపై అనుమానం ఉన్నట్టు గురువారం ఊటీ నగర సెంట్రల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి రాజలక్ష్మి వద్ద విచారణ చేయగా ఆమె పొంతన లేని సమాధానాలివ్వడంతో పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లి విచారణ జరిపారు. వివాహేతరానికి సంబంధానికి అడ్డుగా ఉన్న కుమార్తెను రాజలక్ష్మి చీరతో గొంతు నులిమి హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు ఆమెని అరెస్టు చేసి, ఊటీ కోర్టులో హాజరుపరిచి, కోవై జైలుకు తరలించారు.