హత్య కేసు వివరాలు తెలుపుతున్న డీఎస్పీ
నిజామాబాద్ ,ఎల్లారెడ్డి: జులాయిగా తిరుగుతూ, ఇంట్లో వాళ్లను చంపుతానని బెదిరిస్తున్న కన్న కొడుకునే హత్య చేయించిన తల్లిని, హత్య చేసిన నిందితుడితో పాటు సహకరించిన చిన్నకొడుకును పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతేడాది అక్టోబర్ 12న ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలోని మాచాపూర్ శివారులో ఓ వ్యక్తిని తలపై రాడ్డుతో కొట్టి హత్య చేశారు. ఒంటిపై దుస్తులు తొలగించి, ముఖంపై పెట్రోల్ పోసి తగులబెట్టి ఆధారాలు లేని ఈ కేసులో నాలుగు నెలలపాటు సాగిన పోలీసుల పరిశోధన కొలిక్కి వచ్చింది. డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కటికె గోడెకర్ యాదిలాల్ అలియాస్ యాదుల్ మటన్‌షాప్ నిర్వహిస్తుండేవాడు. ఇక్కడ సరైన ఆదాయం రాక 2016లో హైదరాబాద్ జియాగూడకు వలస వెళ్లాడు. అక్కడ భార్య అశ్విని బంధువైన చంద్రకళతో పరిచయం ఏర్పడింది. చంద్రకళ పెద్ద కొడుకు మాల్‌తుకుకార్ ప్రవీణ్‌కుమార్(40) ఏ పని చేయకుండా జులాయ్‌గా తిరిగేవాడు. తనను, తన కూతురు, చిన్న కొడుకు సోను అలియాస్ మహావీర్‌ను డబ్బుల కోసం వేధిస్తూ చంపుతానని భయపెడుతున్నాడని తరుచూ చంద్రకళ యాదిలాల్‌కు చెప్పుకునేది. కొద్ది రోజులకు భార్యతో గొడవ పడి యాదిలాల్ ఎల్లారెడ్డికి వచ్చేశాడు. ఒకరోజు చంద్రకళ యాదిలాల్‌కు ఫోన్ చేసి తన పెద్ద కొడుకు వేధింపులు అధికమయ్యాయని అతడిని హత్య చేస్తే రూ.3 లక్షలు చెల్లిస్తానని బేరం కుదుర్చుకుంది.
ఈ మేరకు ఆమె రూ.50 వేలను నిందితుడికి అందించింది. దీంతో నిందితుడు యాదిలాల్ ప్రవీణ్‌ను ఎల్లారెడ్డిలో పెళ్లి సంబంధం చూపెడతానని ఆశ చూపి 2017 అక్టోబర్ 12న పిలిచాడు. పథకం ప్రకారం హైదరాబాద్ నుంచి గోపాల్‌పేట్‌లో దిగాలని తాను అక్కడే కలుస్తానని ప్రవీణ్‌కు చెప్పాడు. ఇద్దరూ కలిసి మద్యం తీసుకుని మాచాపూర్ శివారులో తాగారు. మద్యం మత్తులో ఉన్న ప్రవీణ్‌ను పథకం ప్రకారం తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో తలపై కొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.. ప్రవీణ్‌ను హత్య చేసిన విషయం చంద్రకళకు తెలియజేయగా శవాన్ని గుర్తు పట్టరాకుండా మార్చేసి సాక్ష్యాలు లేకుండా చేయమని ఆమె సూచించింది. శవం ఒంటిపై దుస్తులన్నీ తొలగించి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అనంతరం మృతుడి దుస్తులు, సెల్‌ఫోన్, ఇనపరాడ్‌ను పట్టణ శివారులోని పెద్ద చెరువులో వేసి సాక్ష్యాలు లేకుండా చేశాడు. అనంతరం ఒప్పందం ప్రకారం మిగితా రూ.2.50 లక్షలు ఇవ్వాలని చంద్రకళపై ఒత్తిడి తెచ్చాడు. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని కొద్ది రోజుల తర్వాత చెల్లిస్తానని ఆమె నిందితుడికి ప్రాంసరీ నోట్ రాసి ఇచ్చింది.
తమ గ్రామ శివారులో శవం కనిపించిందంటూ మాచాపూర్‌వాసులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధించారు. ఎలాంటి ఆనవాళ్లు లేని మృతుడు ఎవరు, అతడిని ఎవరు హత్య చేశారో తెలుసుకోవడానికి పోలీసులకు చాలా కష్ట పడాల్సి వచ్చింది. మృతుడి ఫొటోను ఫ్లెక్సీ చేయించి జన సమ్మర్థం గల ప్రాంతాలు, జిల్లాల పోలీస్‌స్టేషన్లలో, పక్క రాష్ట్రాల వాహనాలకు అతికించి సమాచారం కోసం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జియాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యక్తి కనిపించడం లేదంటూ వచ్చిన సమాచారంతో పరిశోధన ఆ వైపు సాగించారు. మృతుడి ఫోన్‌కాల్ రిజిష్టర్, ఇతర ఆధారాలతో నిందితుడు యాదిలాల్‌ను విచారించారు. మృతుడి తల్లి చంద్రకళ సూచనల మేరకే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు. సీఐ సుధాకర్, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment