
ప్రతీకాత్మక చిత్రం
అనారోగ్యంగా ఉన్న శిశువును వెంటబెట్టుకుని సొంత ఊరికి కదిలింది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఆ శిశువు కన్నుమూసింది. చనిపోయిన శిశువును..
రాంచీ : చనిపోయిన శిశువు అంత్యక్రియలు నిర్వహించటానికి డబ్బులు లేవన్న కారణంతో ఓ తల్లి మృత శిశువును జాతీయ రహదారిపై పడవేసింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధన్‌బాద్‌కు చెందిన డాలీ అనే మహిళ గత నెల 30వతేదీన పురిటి నొప్పులతో బొకారో జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా అక్టోబర్ 1వతేదీన శిశువుకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స చేయించాల్సిందిగా ఆమెకు సూచించారు. అయితే ఆమె పక్కనే ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రిలో శిశువును చేర్పించింది. ఆసుపత్రి వారు చికిత్స చేయటానికి రోజుకు 8వేల రూపాయలు వసూలు చేస్తుండటంతో ఆ ఖర్చు ఆమెకు పెను భారంగా మారింది.
దీంతో అనారోగ్యంగా ఉన్న శిశువును వెంటబెట్టుకుని సొంత ఊరికి ప్రయాణమైంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మార్గం మధ్యలో ఆ శిశువు కన్నుమూసింది. చనిపోయిన శిశువును ఇంటికి తీసుకువెళితే అంత్యక్రియల నిమిత్తం డబ్బులు ఖర్చు చేయవలసివస్తుందని భావించిన ఆమె శిశువును ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేసింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. శిశువు మృతదేహం ఉన్న చోటుకు చేరుకున్న పోలీసులు కవర్‌పై ఉన్న ఆసుపత్రి లోగో ఆధారంగా వివరాలు సేకరించి డాలీని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు డబ్బులేని కారణంగానే మరణించిన బిడ్డను అలా రోడ్డు పక్కన పడేశానని డాలీ తెలిపింది. ఇప్పటికే కాన్పు ఖర్చుల నిమిత్తం అప్పులు చేయాల్సివచ్చిందని పేర్కొంది.