
ముంబై: యాంకర్ అర్పితా తివారి(24) అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. ఆమెను హత్య చేసివుండొచ్చ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గాయాల కారణంగా ఆమె చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. అయితే ఆమెపై లైంగిక దాడి జరగలేదని తెలిపింది. ఊపిరి ఆడకుండా చేయడం లేదా గొంతు నులిమిన ఆనవాళ్లు కూడా లేవని వివరించింది. అర్పితను హత్య చేసివుంటారన్న అనుమానాలను కొట్టిపారేయలేమని పోలీసులు అన్నారు. క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి ఆధారం లభించలేదు.
ముంబైలోని మాల్వావ్ ప్రాంతంలోని ఒక భవనంపై ఆమె మృతదేహాన్ని సోమవారం కనుగొన్నారు. అపార్ట్‌మెంట్ 15వ అంతస్తు నుంచి దూకడంతో ఆమె చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని మొదట భావించారు. అయితే అక్కడ ఎటువంటి సూసైడ్ లభించకపోవడంతో అనుమానాలు వచ్చాయి. పంకజ్ జాధవ్ అనే యువకుడిని ప్రేమిస్తున్న అర్పిత అతడితో తెగతెంపులు చేసుకోవాలని అనుకున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
పంకజ్ నివసిస్తున్న మానవస్తల్ అపార్ట్‌మెంట్‌కు ఆదివారం రాత్రి అర్పిత వెళ్లింది. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. పొద్దున 7 గంటలకు లేచిచూస్తే ఆమె కనిపించలేదు. బాత్రూమ్ తలుపు లోపలి నుంచి వేసివుండటం, షవర్ ఆన్‌చేసి ఉండడంతో పంకజ్ మళ్లీ పడుకున్నాడు. ఉదయం 9 గంటలకు కూడా ఆమె జాడ లేకపోవడంతో స్నేహితుల సహాయంతో బాత్రూమ్ తలుపు తెరిచాడు. అక్కడ అర్పిత కనబడలేదు. కిటికీ తలుపు అద్దాలు తీసేసి ఉండటంతో అక్కడి నుంచి ఆమె దూకేసి ఉంటుందని గమనించి వెతకడం మొదలుపెట్టారు. రెండో ఫ్లోర్‌లో రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు తేల్చారు. అర్పిత మరణానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె సెల్‌ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment