
గాయపడిన వృద్ధురాలు ఈశ్వరమ్మ
కొళాయి వద్ద దూషిస్తోందని రోకలిబండతో దాడి
మదనపల్లె టౌన్ : అనవసరంగా నోరు పారేసుకుంటోందని ఓ వృద్ధురాలిపై పొరుగింటి మహిళ రోకలిబండతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం తంబళ్లపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు, తంబళ్లపల్లె పోలీసుల కథనం..కోటకొండకు చెందిన తంగిళ్ల లక్షుమన్న భార్య ఈశ్వరమ్మ(80) ఇంటిముందే కొళాయి ఉంది. వీధుల్లో ఉన్న వాళ్లు ఆ కొళాయి వద్ద నీటిని పట్టుకుని వెళ్తుంటారు. ఆ సమయంలో ఈశ్వరమ్మ దూషిస్తూ ఉండడంతో పొరుగింటికి చెందిన రాజన్న భార్య స్వర్ణమ్మకు మండుకొచ్చింది. దీంతో ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఆమె రోకలి బండతో ఈశ్వరమ్మపై దాడిచేసింది. ఈ దాడిలో కాళ్లూచేతులు విరిగి ఈశ్వరమ్మ అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాధితురానికి 108లో హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్‌తో ఆమె కోలుకుని జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు విస్తుపోయారు. వెంటనే తంబళ్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు ఈశ్వరమ్మను తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు. తంబళ్లపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.