
ప్రియురాలు సుజాతతో సతీష్ (ఫైల్‌ఫొటో) , సతీష్
విశాఖ క్రైం: ఒంటరి మహిళతో మాటలు కలిపాడు. ప్రేమగా చేరువై సహజీవనమూ చేశాడు. కొన్నాళ్ల తర్వాత తనో ఇంటివాడు కావాలనుకున్నాడు. అందుకు అడ్డంకిగా మారిన ప్రియురాలిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళిక రచించుకుని హత్య చేశాడు. ఏ ఆధారమూ లభించకపోవడంతో మిస్టరీగా మారినప్పటికీ పోలీసులు ప్రతిష్టాత్మకంగా భావించి భిన్నకోణాల్లో శోధించి ఛేదించారు. సఖ్యతగా ఉన్నప్పుడు ప్రియుడు కొనిచ్చిన పట్టీలే నిందితుడిని పట్టించాయి. పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపాలెం నరవ రహదారిలోని రైల్వే లే అవుట్ సమీపంలో జరిగిన మహిళ హత్యకేసులో ప్రియుడే కాలయముడని తేల్చారు. అనైతిక సంబంధాలు చివరకు విషాదాంతం అవుతాయనేందుకు మరో ఉదాహరణగా నిలిచిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీసీపీ రవికుమార్‌మూర్తి వెల్లడించారు. హంతకుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...
బతుకుతెరువుకు నగరానికి వచ్చి...
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కొండపూరి సుజాత (32)కు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తితో 2004లో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా 2011లో భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. అనంతరం విశాఖపట్నం చేరుకుని అశీలుమెట్ట దరి సంపత్ వినాయకుని గుడి సమీపంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ఎన్‌ఏడీ కొత్తరోడ్డు జంక్షన్‌లోని హెర్బల్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అదే జంక్షన్‌లో ఫొటో స్టూడియో నడుపుతున్న దేవరాపల్లి మండలం తిమిరాం గ్రామానికి చెందిన రాయపురెడ్డి సతీష్(27)తో సుజాతకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీయడంతో 2016వ సంవత్సరం ఏప్రిల్ 2న ఇద్దరూ సింహాచలంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం బాజీ జంక్షన్ వద్ద ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు.
అనంతరం గోపాలపట్నం పెట్రోల్ బంక్ సమీపంలో ఈశ్వర్ డిజిటల్ పేరుతో మరో స్టూడియోను సతీష్ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో అతనికి గాజువాక నుంచి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. తనను కాదని పెళ్లి చేసుకునేందుకు సతీష్ సిద్ధం కావడంతో ఆగ్రహించిన సుజాత పెద్దలను సంప్రదించింది. ఈ క్రమంలో సతీష్ స్వగ్రామం దేవారాపల్లి మండలంలోని తిమిరాం గ్రామానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులకూ విషయం తెలియజేసింది. తాము సింహాచలం లో పెళ్లి చేసుకున్నామని, తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు పెరగడంతో బాజీ జంక్షన్‌లోని ఇల్లు ఖాళీ చేసేసి రామాటాకీస్ సమీపంలోని వర్కింగ్ వుమెన్స్ హాస్టల్‌లో సుజాత చేరింది.
ప్రేమగా నమ్మించి గొంతు నులిమేశాడు
♦ తన వివాహానికి అడ్డంకిగా ఉన్న సుజాత అడ్డు తొలగించుకోవాలని సతీష్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం ముందే ప్రణాళిక రచించుకుని స్థలం కూడా ఎంపిక చేసుకున్నాడు.
♦ ప్రణాళికలో భాగంగా ఈ నెల 3న రాత్రి 7 గంటల సమయంలో రామాటాకీస్ సమీపంలోని హాస్టల్‌కు వెళ్లి సుజాతను బైక్‌పై తీసుకెళ్లాడు.
♦ అనంతరం ఇద్దరూ వీమ్యాక్స్‌లో సెకెండ్ షోకి వెళ్లి రంగస్థలం సినిమా చూశారు.
♦ థియేటర్ నుంచి బీచ్‌కు వెళ్లి కొంత సేపు గడిపిన తర్వాత నేరుగా గోపాలపట్నంలోని ఫొటో స్టూడియోకు చేరుకున్నారు.
♦ స్టూడియోలో కొంతసేపు గడిపిన తర్వాత బయటకు వెళ్దామని సుజాతను నమ్మించాడు.
♦ ముందుగానే తను ఎంపిక చేసుకున్న పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపాలెం నరవ రహదారిలోని రైల్వే లే అవుట్ వద్దకు తీసుకెళ్లాడు.
♦ అక్కడ మాటలు కలిపి ముందుగానే కొనుగోలు చేసి తీసుకొచ్చిన తాడును సుజాత మెడకు బిగించి హతమార్చాడు.
♦ అనంతరం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు బైకులోని పెట్రోల్ తీసి మృతదేహంపై పోసి కాల్చేసి అక్కడి నుంచి పరారైపోయాడు.
పట్టించిన పట్టీలు
♦ స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నవుడు దేముడుబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు. సమీపంలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించినా ఎక్కడా ఏ ఆధారమూ లభించలేదు.
♦ మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చేయడంతో పెద్దగా ఆనవాళ్లు దొరకలేదు.
♦ ఆ సమయంలోనే పోలీసులకు మృతురాలి కాళ్లకు ఉన్న పట్టీలు కనిపించాయి.
♦ వాటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో నగరంలోని ప్రముఖ దుకాణంలో కొనుగోలు చేసినట్లు ఆ కంపెనీ లోగో కనిపించింది.
♦ వెంటనే సదరు దుకాణం నిర్వాహకుల నుంచి జాబితా సేకరించగా సుజాత పేరు మీద పట్టీలు కొనుగోలు చేసినట్లు బిల్లు లభించింది. బిల్లులోని ఫోన్ నంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తే రాయపురెడ్డి సతీష్ వద్ద ఆగింది. డీసీపీ రవికుమార్ మూర్తి నేతృత్వంలో ఏసీపీ అర్జున్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి సతీష్‌ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారిస్తే హత్యోదంతం మొత్తం వెలుగుచూసింది. సమావేశంలో ఏసీపీ అర్జున్, సీఐలు సూర్యనారాయణ, చంద్రశేఖర్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.