నిందితులు ఉపయోగించిన స్కార్పియో మారణాయుధాలతో డీఎస్పీ నాగరాజ, సిబ్బంది
పులివెందుల (వైఎస్సార్ కడప): ఈనెల 9వ తేదీ రాత్రి స్థానిక భాకరాపురంలో జరిగిన రంగేశ్వరరెడ్డి హత్యకు పాత కక్షలే కారణమని పులివెందుల డీఎస్పీ నాగరాజ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగేశ్వరరెడ్డికి అతని చిన్నాన్న కుమారుడు చంద్రశేఖరరెడ్డికి గతంలో పాతకక్షలు ఉండేవన్నారు. వీరిద్దరు కలిసి గతంలో అనేక పంచాయితీలు, నేరాలు చేసేవారన్నారు. ఆ లావాదేవీలలోనూ, డబ్బు పంపకాల విషయంలోనూ వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి ఒకరిపై ఒకరు కక్ష పెంచుకున్నారన్నారు. రంగేశ్వరరెడ్డి చంద్రశేఖరరెడ్డిని చంపాలని ప్రయత్నం చేసేవాడన్నారు. దీంతో చంద్రశేఖరరెడ్డి రంగేశ్వరరెడ్డి బతికి ఉంటే ఎప్పుడైనా తన ప్రాణానికి ముప్పు అని కొంతమంది వ్యక్తులతో కలిసి హత్య చేశాడన్నారు.
9వ తేదీ రాత్రి రంగేశ్వరరెడ్డి తన ఇంటి వద్ద ఉన్న పునాదులపై కూర్చొని ఉండగా సమాచారం అందుకున్న చంద్రశేఖరరెడ్డి పులివెందులకు చెందిన హరికృష్ణారెడ్డి, రవిశేఖరరెడ్డి, షేక్ ఇమాం బాషాలతో కలిసి రంగేశ్వరరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి తమ వెంట తెచ్చుకున్న మచ్చుకొత్తి, గొడ్డలి, పిడిబాకు, రాడ్లతో మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ హత్యలో వీరికి సహకరించిన నవీన్, సురభి మహేష్, బుక్కూరి నవీన్‌కుమార్, షేక్ బాబావల్లి, షేక్ ముబారక్ బాషా, పల్లపు మురళీకృష్ణ, బొక్కూరి నవీన్‌కుమార్, మెయిళ్ల ప్రకాష్‌రెడ్డి, చప్పిడి బాబురెడ్డి, బలిజ రాముడు, చెప్పాలి రెడ్డయ్య, చిలంకూరు వీరాంజనేయులతోపాటు మొత్తం 16మందిపై కేసులు నమోదు చేశా>మన్నారు. వీరిలో కడప రింగ్‌రోడ్డు వద్ద కొంతమందిని, శిల్పారామం వద్ద కొంతమందిని అరెస్టు చేశామన్నారు. హత్యకు నిందితులు ఉపయోగించిన స్కార్పియో వాహనంతోపాటు మారణాయుధాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీఐ పుల్లయ్య, ఎస్‌ఐలు రఘునాథ్, శివకుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment