మృతిచెందిన శ్రీకాంత్‌రెడ్డి , పోలీసులతో మాట్లాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులు
దేశానికి సేవ చేయాలన్న లక్ష్యం మదిలో మెదులుతుండగా.. అందుకోసం అహర్నిశలు శ్రమించేందుకు సిద్ధమయ్యాడు కామిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది.. దేశానికి సేవలందించాలన్న కల చెదిరిపోయింది.. కరెంటుషాక్ తగలడంతో కుప్పకూలిపోయాడు.. గల్ఫ్‌దేశాల్లో పనిచేసుకుంటూ శ్రీకాంత్‌రెడ్డిని చదివించుకుంటున్న తల్లిదండ్రుల బాధ ఇక
వర్ణనాతీతం.
కడప అర్బన్/వైవీయూ : కడపలోని ఎన్‌సీసీ నగర్‌లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఎన్‌సీసీ కేడెట్ కె.శ్రీకాంత్‌రెడ్డి మృతి చెందాడు. టి.సుండుపల్లె మండలం వాయిల్పాటి వాండ్లపల్లెకు చెందిన కె. రాజగోపాల్‌రెడ్డి, సుజాత దంపతుల కుమారుడైన ఇతను ప్రస్తుతం కడపనగరంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్నాడు. అనంతరం ఎన్‌సీసీలో ప్రవేశం పొంది త్వరలో బీ సర్టిఫికెట్ పరీక్షలు రాసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. అయితే ఈనెల 25వ తేదీన నగరంలో ఎన్‌సీసీ దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఎన్‌సీసీ కేడెట్స్ నగరంలోని (తెలుగుగంగ కాలనీ) ఎన్‌సీసీ నగర్‌లోని 30 ఆంధ్రా బెటాలియన్‌లో సాధన చేస్తున్నారు.
దీంతో పాటు కేడెట్స్‌కు సంబంధించిన ఎన్‌రోల్‌మెంట్‌లో తప్పులు ఉన్నాయని వచ్చి సరిచేసుకోవాలని ఎన్‌సీసీ అధికారులు సూచించడంతో ఇందులో భాగంగా శుక్రవారం కె. శ్రీకాంత్‌రెడ్డి, పాలకొండ్రాయుడు, హర్షవర్ధన్‌రెడ్డి, హేమంత్‌లు కలిసి బెటాలియన్‌కు వెళ్లారు. అక్కడ సిబ్బంది వంటగది సమీపంలోని ఓ గదిని శుభ్రం చేసేందుకు ఇనుప నిచ్చెన తీసుకెళ్లేందుకు కేడెట్స్‌ను సహాయం కోరారు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి, పాలకొండ్రాయుడు, ఆర్మీ సిబ్బంది హవల్దార్ ఉపేంద్రకుమార్ ఇనుప నిచ్చెన పట్టుకుని వెళ్లే సమయంలో వర్షం పడుతుంది. అందరూ కలిసి నిచ్చెనను పైకి ఎత్తారు. విద్యుత్ తీగలు తగిలి ఇనుప నిచ్చెనకు తాకడంతో షాక్ తగిలి శ్రీకాంత్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. అతను కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదు. కాగా పాలకొండ్రాయుడు, ఉపేంద్రకుమార్ కాళ్లకు బూట్లు వేసుకుని ఉండడంతో వీరిద్దరికి ప్రాణాపాయం తప్పింది. పాలకొండ్రాయుడు స్వల్పగాయాలతో బయటపడగా.. హవల్దార్ ఉపేంద్రకుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ముగ్గురిని ఎన్‌సీసీ వాహనంలో రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ శ్రీకాంత్‌రెడ్డి(19) మృతి చెందాడు. ఉపేం ద్రకుమార్‌ను మెరుగైన చికిత్స కోసం నగరంలోని కొమ్మా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.
పలు ఆరోపణలు
కేడెట్ మరణవార్తను తెలుసుకున్న ఎన్‌సీసీ కమాం డింగ్ ఆఫీసర్ కల్నల్ రవిచంద్రన్ క్యాంపు నుంచి తిరుగుపయనమైనట్లు సమాచారం. కాగా ఎన్‌సీసీ కేడెట్స్‌ను ఎన్‌సీసీ నగర్‌లో పనిచేయించుకునేం దుకు తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిం చాయి. అయితే దీనిపై ఎన్‌సీసీ సూపరింటెండెంట్ శంకర్‌ను వివరణ కోరగా సంఘటన దురదృష్టకరమన్నారు. ఈనెల 25వ తేదీన ఎన్‌సీసీ దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో కేడెట్స్‌ను సాధన చేసేందుకు పిలిపిస్తున్నామన్నారు. అదే విధంగా నామినల్‌రోల్స్‌లో వివరాలు తప్పుగా ఉండడంతో సరిచేసుకునేందుకు వీరిని పిలిపించామన్నారు. అదే సమయంలో నిచ్చెన పట్టేందుకు సహాయం కోరగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. మరణించిన కేడెట్ శ్రీకాంత్‌రెడ్డికి ఎన్‌సీసీ కేడెట్ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఆర్థికసాయం అందిస్తామని, ఇందుకోసం సీఓ సూచనల మేరకు రిపోర్ట్ పంపామని తెలిపారు. కాగా చనిపోయిన శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాన్ని రిమ్స్‌లో జిల్లా సైనిక సంక్షేమ అధికారి డాక్టర్ ఎం. రామచంద్రారెడ్డి పరిశీలించారు. అదే విధంగా కొమ్మా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న హవల్దార్ ఉపేంద్రకుమార్‌ను ఆయన పరిశీలించారు.
రిమ్స్ వద్ద ఆందోళన, ఉద్రిక్తత..
ఎన్‌సీసీ కేడెట్ కె. శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి ఉదయం 11.30 గంటల ప్రాం తంలో తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతుని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కుటుంబాన్ని ఆదుకోవాలని తాము ప్రతిపాదించిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని.. అలాగే ఎక్స్‌గ్రేషియా రూ.20లక్షలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసూంబాషా ఆధ్వర్యంలో సీఐలు నాయకుల నారాయణ, నాగరాజరావు, పద్మనాభన్, ఎస్‌ఐ లు హేమకుమార్, కుళ్లాయప్ప, నాగార్జున, కొం డారెడ్డిలు, స్పెషల్‌పార్టీ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా మోహరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు తిరుమలేష్, దస్తగిరి, సుబ్బరాయుడు, మధుబాలాజీ, శివశంకర్, రాజ్‌కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు మద్దిలేటి, ఈశ్వరయ్యలు పోలీసులు, ఎన్‌సీసీ సిబ్బందితో చర్చలు జరిపారు. శ్రీకాంత్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి పిలిపించుకునే ముందు అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లనే శ్రీకాంత్‌రెడ్డి మృత్యువాత పడ్డాడని.. 19 సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న చెట్టంత కొడుకును పోగొట్టుకున్నామని తీవ్రంగా రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసినప్పటికీ అంబులెన్స్‌ను అక్కడి నుంచి వెళ్లకుండా తమ సమస్య తీరేదాకా ఒప్పుకోమని అడ్డుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో ఎన్‌సీసీ ముఖ్య అధికారులతో మాట్లాడి తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. తీవ్ర గందరగోళం మధ్య ఎట్టకేలకు ఎన్‌సీసీ అధికారులు చెప్పిన మాటలకు అంగీకరించిన బంధువులు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామం వాయల్పాటివాండ్ల పల్లెకు తీసుకెళ్లారు.
కేసు నమోదు
సంఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డ సహచర ఎన్‌సీసీ కేడెట్ పాలకొండ్రాయుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. శ్రీకాంత్‌రెడ్డి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ హేమకుమార్ తెలిపారు.
కోమా నుంచి తిరిగివచ్చి..
సుండుపల్లె: విద్యుదాఘాతంలో మృతిచెందిన శ్రీకాంత్‌రెడ్డి గత ఏడాది సుండుపల్లె మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లాడు. చాలా రోజుల తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఉన్నత చదువులకోసం కడప ఆర్ట్స్ కళాశాలలో చేరాడు. శుక్రవారం విద్యుత్‌ఘాతంతో శ్రీకాంత్‌రెడ్డి మృతిచెందాడని విషయం కుటుంబసభ్యులకు తెలియగానే వారి రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, సుజాత బతుకుదెరువుకోసం కువైట్‌కు వెళ్లారు. వీరికి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డితోపాటు ఒక కూతురు ఉంది. కుమారుడి మరణవార్తను తెలుసుకున్న తల్లిదండ్రులు గల్ఫ్ నుంచి స్వగ్రామం బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment