సాక్షి, సిటీబ్యూరో: పొట్టకూటి కోసమంటూ సరిహద్దులు దాటి వస్తున్నారు.. ఎక్కడ చూసినా సెక్యూరిటీ గార్డులుగా, సహాయకులుగా కనిపిస్తున్నారు.. చాలీచాలని వేతనాలకు పని చేస్తున్నారు.. అదను చూసుకుని ‘చేను మేసి’ ఉడాయిస్తున్నారు. ఇవీ నగరంలో చోటు చేసుకుంటున్న నేపాలీల క్రైమ్‌స్టోరీలు. తాజాగా బుధవారం నారాయణగూడ పరిధిలో వెలుగులోకి వచ్చిన రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాభరణాలు, రూ.4 లక్షల నగదు ఎత్తుకుపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నేపాలీల ఘాతుకాలకు సంబంధించిన అంశాలు గతంలోనూ ఎన్నో చోటు చేసుకున్నాయి. ఒకసారి నేరం చేసి పారిపోతే.. వీరిని పట్టుకోవడం సైతం సవాల్‌గా మారుతోంది.
గూర్ఖాల నుంచి గార్డులుగా..
ఒకప్పుడు నేపాల్, అసోంలకు చెందిన వారు కేవలం గూర్ఖాలుగానే కనిపిస్తుండేవారు. అయితే రాజధానిలో వర్తక, వాణిజ్య సంస్థలు కుప్పలు తెప్పలుగా పుట్టుకువచ్చాయి. వీటి రక్షణ కోసం సెక్యూరిటీ గార్డుల ఆవశ్యకత పెరిగింది. ఇబ్బడిముబ్బడిగా పుట్టుకువచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల ‘కక్కుర్తి’ పుణ్యమా అని వీరంతా సరిహద్దులు దాటి గార్డులుగా ప్రత్యక్షమవుతున్నారు. వ్యాపార సంస్థలు, కార్యాలయాలకు మాత్రమే కాకుండా అనేక మంది ప్రముఖుల ఇళ్ల వద్ద సైతం భద్రత వీరి బాధ్యతగానే మారింది. చివరకు పార్కులు, రెస్టారెంట్ల, రెసార్టుల్లోనూ వీరే కనిపిస్తున్నారు. ఇలా సరిహద్దు రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి సెక్యూరిటీగా పని చేస్తున్న వారి జీవితాలు దుర్భరమనే చెప్పాలి. ఏ రకంగా చూసుకున్నా వీరికి నెలకు అందే వేతనం రూ.10 వేలు దాటదు. అదే పని దగ్గరకు వచ్చేసరికి మాత్రం గొడ్డుచాకిరీనే. ఇలా వచ్చే జీతంలోనూ కమిషన్లు, ఇతరాలు పోగా వీరి చేతికి అందేది గొర్రెతోక చందమే. ఈ దుర్భర జీవితాన్ని గడుపుతున్న నేపాల్ వాసులు అదను చూసుకుని పంజా విసురుతున్నారు. నమ్మి ఉద్యోగం ఇచ్చిన వారినే నట్టేట ముంచుతున్నారు.
వీరి ఘోరాలు ఎన్నో...
⇒ అదను చూసుకుని పంజా విసురుతున్న ఈ ‘పొరుగు’ వారు దోపిడీలు, దొంగతనాలతో పాటు హత్యలు సైతం చేస్తున్నారు.
⇒ 2006 ఏప్రిల్ 28న పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్‌కాలనీలో చోటు చేసుకున్న జస్పీర్‌సింగ్ హత్యే ఇందుకు నిదర్శనం. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఇతని సోదరుడైన పరంజీత్ సింగ్ వారి దగ్గరే పని చేస్తున్న నేపాలీ సత్య ద్వారా హత్య చేయించాడు.
⇒ 1999లో నేపాల్ నుంచి వలసవచ్చి నగరంలో సెక్యూరిటీ గార్డు కమ్ డ్రైవర్‌గా పని చేసిన శంకర్ ఖడ్కా అలియాస్ నవీన్‌కుమార్ 2009లో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో తాను పని చేస్తున్న ఇంటి యజమానురాలు సురేఖను దారుణంగా హత్య చేసి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ ఘాతుకంలో ఇతనికి అసోంకు చెందిన సురేష్, సంగమ్ సహకరించారు. డబ్బు కోసమే ఈ హత్య చేసినట్లు నిర్ధారణ అయింది.
⇒ 2009లో పాయిజన్ పబ్‌లో చోటు చేసుకున్న సెక్యూరిటీ సూపర్‌వైజర్ హత్య సైతం నేపాల్‌కు చెందిన వారి పనే.
⇒ 2010లో బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.10లో ఉన్న శంకర్‌లాల్ అండ్ సన్స్ జ్యువెలర్స్‌లో దోపిడీకి ఒడిగట్టింది అక్కడ సెక్యూరిటీ గార్డులు గా పని చేస్తున్న నేపాలీ, అసోంకు చెందినవారే.
⇒ 2016లో కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే ఆర్మీ మాజీ ఉన్నతాధికారి ఇంటి నుంచి రూ.3 కోట్ల విలువైన సొత్తు ఎత్తుకుపోయారు.
⇒ గత ఏడాది అబిడ్స్ పరిధిలో నివసించే వ్యాపారవేత్త ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీలు అదను చూసుకుని రూ.కోటి సొత్తుతో పరారయ్యారు.
పోలీసులకు తల‘బొప్పులు’...
వీరు నేరాలు చేసినప్పుడల్లా ఆ కేసుల దర్యాప్తు పోలీసులకు పెనుసవాలే. వీరికి ఉద్యోగాలు ఇస్తున్న సెక్యూరిటీ సంస్థలు తమ వద్ద పూర్తి వివరాలు ఉంచుకోకపోవడం, ఉన్న అరకొర వివరాలూ క్షేత్రస్థాయిలో క్రాస్ చెక్ చేసుకోకపోవడం వంటి కారణాలతో దర్యాప్తులు జటిలమతున్నాయి. మన పోలీసులు సరిహద్దులు దాటి వెళ్లినా... అక్కడి పోలీసుల సహకారం లేక నిందితులు చిక్కట్లేదు. 2016 నాటి కార్ఖానా కేసులో నిందితులకు సంబంధించి పోలీసులు వద్ద పూర్తి ఆధారాలు, నేరగాళ్ల చిరునామాలు ఉన్నాయి. అనేక ప్రత్యేక బృందాలు కొన్ని నెలల పాటు అక్కడ మకాం వేసి మరీ వచ్చాయి. అయినప్పటికీ ‘స్థానిక సహకారం’ లేని కారణంగా నిందితుల్ని పట్టుకోలేకపోయారు. అనుమానితుల విచారణలో భాష అనేది మరో ప్రధాన అడ్డంకిగా మారుతోంది. దేశ సరిహద్దులు దాటకుండా చిక్కితే మా త్రమే వీరి అరెస్టుకు ఆస్కారం ఉంటోంది. అలా కాకుండా వారి స్వస్థలాలకు చేరితే మాత్రం ఇక ఆ కేసు విషయం మర్చిపోవాల్సి వస్తోంది. దీనికి కొన్ని దౌత్యపరమైన అడ్డంకులు ఉంటున్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
⇔ ఎవరినైనా పనిలో పెట్టుకునే మందువారి వివరాలు, పూర్వాపరాలు తెలుసుకోవాలి.
⇔ అవతలి వారు చెబుతున్నది వాస్తవమా.. కాదా? అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.
⇔ ఉద్యోగంలో చేరిన వారి ఫొటోలను తీసుకోవడం ఉత్తమం.
⇔ వారి సొంత ఊరితో పాటు బంధువుల వివరాలు, చిరునామాలు రికార్డు చేసిఉంచాలి.
⇔ వీటన్నింటికీ స్థానిక పోలీసుస్టేషన్‌లో అందించాలి.
⇔ గతంలో ఎక్కడ పని చేశారు? అక్కడ వీరి ప్రవర్తన ఏమిటి? అనేవి ఆరా తీయాలి.
⇔ సాధ్యమైనంత వరకు తెలిసిన వారు సిఫార్సు చేసిన వారినే పనిలో పెట్టు కోవాలి.
⇔ మార్కెట్ వాల్యూ, మినిమం కాస్ట్ ఆఫ్ లివింగ్‌ను దృష్టిలో పెట్టుకుని జీతం ఇవ్వాలి.
⇔ పని చేస్తున్న సందర్భంలో వారి వ్యవహారశైలిని నిశితంగా గమనించాలి.
⇔ వారి ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు తప్పనిసరిగా సేకరించాలి.
⇔ ఇళ్లను పనివాళ్లకు వదిలి ఎక్కడికైనా వెళితే విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో పెట్టుకోవడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment