నేపాలీ గ్యాంగ్ సభ్యులు
బంజారాహిల్స్: సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అగ్ర వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడే నేపాల్ గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. గతంలో ఆబిడ్స్‌లోని ఓ నగల దుకాణంతో పాటు ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడి ఉడాయించిన ఈ ముఠా మళ్లీ నగరంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ముఠా సంపన్నులు నివసించే ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని దోపిడీలకు పాల్పడుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ముఠా సభ్యుల ఫొటోలను వివిధ పోలీస్‌స్టేషన్లకు, క్రైం పోలీసులకు పంపించారు. గతంలో ఈ ముఠా చేసిన చోరీల వివరాలను కూడా వారికి చేరవేశారు. నగరంలోని పలువురు సంపన్నుల ఇళ్ల వద్ద నేపాల్‌కు చెందిన వారు సెక్యూరిటీ గార్డులుగా, ఇళ్ళల్లో పని చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు వారిని సంప్రదించి తమను ఎక్కడైనా సెక్యూరిటీ గార్డుగా, ఇళ్లల్లో పని చేయడానికి నియమించాలంటూ నమ్మిస్తారు. వారి ద్వారా విధుల్లో చేరిన అనంతరం సదరు ఇంటి పూర్తి సమాచారం, యజమానుల కదలికలు తెలుసుకొని దొంగతనాలు చేసి ఉడాయిస్తారు.
ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్తమ్ రెడ్డి ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 28లో విల్లామేరి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమినా ఇంట్లో రూ. 30 లక్షల విలువైన ఆభరణాలు, ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 25 లక్షల విలువైన వస్తువులు దొంగిలించింది ఒక్కరే కావడం, సీసీ ఫుటేజీల్లో అతడి కదలికలు, ముఖవర్చస్సు నేపాలీని తలపిస్తుండటంతో పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, సోమాజిగూడ, బేగంపేట తదితర ప్రాంతాల్లో సంపన్నులు తమ ఇళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహించే నేపాలీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వారి పూర్తి వివరాలు, గత చరిత్ర తెలుసుకున్న తర్వాతే పనిలో చేర్చుకోవాలని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డులుగా చేర్చుకునే ముందు ఇతర నేపాలీలను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.
అనుమానాస్పద యువకుడి ఫొటోలు విడుదల
ఖరీదైన నివాసాలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడే నేపాలీ ముఠా సభ్యులు ముగ్గురితో పాటు మరో యువకుడు కూడా వీరితోనే ఉంటూ నేరాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రముఖుల ఇళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులు, కారు డ్రైవర్, ఇంట్లో పని చేసే నెపంతో చేరుతూ అదును చూసి దొంగతనానికి పాల్పడుతుంటాడని పేర్కొంటూ పోలీసులు ఓ యువకుడి ఫొటోలు విడుదల చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని సంపన్నులు ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment