పెగ్గుబాబులు పరార్‌ | new year drunk and drivers going in Incognito | Sakshi
Sakshi News home page

పెగ్గుబాబులు పరార్‌

Published Fri, Jan 5 2018 8:30 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

new year drunk and drivers going in Incognito - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌లో మందుబాబుల పనిపడుతుంటే.. చిక్కినవారు పోలీసుకుల చుక్కలు చూపెడుతున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టుపడిన పెగ్గుబాబులు స్పాట్‌ లో వాహనాన్ని వదిలేసి.. వారంరోజుల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. దీనికి కు టుంబ సభ్యులతో సహా హాజరు కావాలి. తర్వాత కోర్టులో శిక్ష.. వీటి నుంచి తప్పించుకునేందుకు పట్టుబడ్డవారు వాహనాన్ని పోలీసుల వద్దే వదిలేసి మళ్లీ రావడం లేదు. గతేడాది నవంబర్‌ వరకు సిటీ పోలీసుల నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్స్‌లో 17,265 మంది మందుబాబులు వాహæనాలు నడుపుతూ చిక్కారు. వీరిలో కుటుంబీకులు/సంరక్షకుల పర్యవేక్షణలో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సిలింగ్‌ హాజరైన వారిని కోర్టుల్లో హాజరుపరగా.. 3,803 మందికి జైలు శిక్ష పడింది.  

ఆ రెండు భయాల నేపథ్యంలో.. 
స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ‘నిషా’చరులు సాధారణంగా ఆ తరువాతి వారంలో టీటీఐలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఈ ‘కార్యక్రమానికి’ వారితో పాటు కుటుంబంలో ఎవరో ఒకరిని తీసుకురావాలి. వివాహితులు భార్య, అవివాహితులు తల్లిదండ్రులు, సోదరుడు, సంరక్షకులతో కలిసి హాజరుకావాలి. మందుబాబుల్లో చాలా మంది విషయం కుటుంబీకులకు తెలియడానికి ఇష్టపడక కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదు. ఈ అంశంలో సమస్య లేని వారికి కోర్టు భయం పట్టుకుంటోంది. కౌన్సెలింగ్‌ తర్వాత ట్రాఫిక్‌ పోలీసులు సదరు మందుబాబును కోర్టులో హాజరు పరుస్తారు. పట్టుబడిన సమయంలో వారు తీసుకున్న మద్యం మోతాదును బట్టి న్యాయస్థానం వీరికి జైలు శిక్షలు సైతం విధించే ఆస్కారం ఉంది. దీనికి భయపడుతున్న మరికొందరు ట్రాఫిక్‌ పోలీసులకు ‘దూరంగా’ ఉంటున్నారు.  

వారి ‘ఆధార్‌’ సరిపోవాల్సిందే.. 
కౌన్సెలింగ్‌కు హాజరుకావడంతో కొందరు మందుబాబులు తెలివిగా వ్యవహరిస్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. స్నేహితులు, పరిచయస్తుల్ని తమ కుటుంబికులుగా చూపి స్తూ కౌన్సెలింగ్‌కు వస్తున్నారు. ఇలాంటి వారికి చెక్‌ చెప్పడానికి ట్రాఫిక్‌ పోలీసుల ఆధార్‌ కార్డు తప్పనిసరి చేస్తున్నారు. ‘నిషా’చరుడితో పాటు అతడితో వచ్చిన వారి ఆధార్‌ వివరాలను సరిచూస్తున్నారు. దీంతో మరికొందరు మందు బాబులు కౌన్సెలింగ్‌కు రావడం లేదు. ఈ కారణాల నేపథ్యంలో నగరంలోని 25 ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో అనేక వాహనాలు పేరుకుపోతున్నాయి. వీటిని సంరక్షించడం పోలీసు లకు తలకు మించిన భారంగా మారుతోంది. అలాగని కౌన్సెలింగ్‌ లేకుండా నేరుగా కోర్టుకు తరలిస్తే న్యాయమూర్తులు ఉపేక్షించని పరిస్థితులు ఉన్నాయి. ఇలా గత ఏడాది నవంబర్‌ వరకు 17,265 మంది ‘నిషా’చరులు పోలీసులకు చిక్కగా.. 2,500 మంది కౌన్సెలింగ్‌కు రాకుండా వాహనాలను వదిలేశారు.   

‘150’ దాటితే జైలే..  
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని బ్రీత్‌ అనలైజర్ల ద్వారా పరీక్షించి గుర్తిస్తారు. బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ (బీఏసీ)  ‘30 ఎంజీ ఇన్‌ 100 ఎంఎల్‌ బ్లడ్‌’ కంటే ఎక్కువ ఉంటేనే ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకుంటారు. అంటే సదరు వ్యక్తి రక్తంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్‌ ఉన్నట్లు లెక్క. ఈ బీఏసీ కౌంట్‌ 150 కంటే ఎక్కువ నమోదైతే కోర్టులు సీరియస్‌గా తీసుకుని.. ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్షలు విధిస్తున్నాయి. డిసెంబర్‌ 31న చిక్కిన ప్రదీప్‌కు ఈ కౌంట్‌ 178 వచ్చింది. దీంతో తనకు జైలు శిక్ష తప్పదనే భావన, మీడియా భయంతోనే అతడు ‘అజ్ఞాతం’లో ఉండి ఉండచ్చని ట్రాఫిక్‌ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. 

నిర్ణీత సమయమంటూ లేదు.. 
డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీల్లో చిక్కిన వారి నుంచి తక్షణం వాహనం స్వాధీనం చేసుకుంటాం. గరిష్టంగా వారం రోజుల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెబుతాం. ఇది ముగిసిన తర్వాతే కోర్టుకు తరలిస్తాం. అయితే అవసరమైతే ఈ గడువును పొడిగించుకోవచ్చు. తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తి ఇన్ని రోజుల్లో కౌన్సెలింగ్‌ కచ్చితంగా కావాలనే నిబంధన ఏదీ చట్టంలో లేదు. దీంతో అనేక వాహనాలు ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లలో పేరుకుపోతున్నాయి. గరిష్టంగా ఆరు నెలల నుంచి ఏడాది పాటు వేచి చూసిన తర్వాత సదరు వ్యక్తి కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే అప్పుడు న్యాయస్థానంలో అతడిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తాం. కోర్టు వారెంట్‌ జారీ చేస్తే దాని ఆధారంగా సదరు వ్యక్తిని పట్టుకుని కోర్టుకు తరలిస్తాం.         – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్‌ డీసీపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement