పేరుమోసిన గజదొంగ గుంటూరు నగరంలో రెక్కీ నిర్వహించాడన్న సమాచారంతో జిల్లా పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఆ దొంగ ఉత్తర భారత్‌కు చెందిన ప్రమాదకర నేరస్తుడని ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు రావడంతో అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా గుంటూరుతోపాటు, పట్టణాల్లోని లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు రహస్యంగా తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
సాక్షి, గుంటూరు: రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరులో గజదొంగ సంచరించా డంటూ వచ్చిన ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీసు యంత్రాంతం ఒక్కసారిగా ఉలికి పాటుకు గురైంది. అత్యంత ప్రమాదకరమైన ఈ దొంగ ముందస్తుగా రెక్కీ నిర్వహించి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు..
జిల్లాలో కొద్దిరోజుల క్రితం ఉత్తర భారతదేశానికి చెందిన వాడిగా భావిస్తున్న గజదొంగ కదలికలు గుంటూరు నగరంలో కనిపిం చాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు చేపట్టింది. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాలతోపాటు, గుంటూరు నగరంలో కూడా హోటళ్లు, లాడ్జీల్లో రహస్యంగా తనిఖీలు చేపట్టి, ఆయా గదుల్లో ఉన్న వారి వివరాలను తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీలు, లాడ్జీ ల్లోని రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పదంగా గుర్తించిన వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదంతా రహస్యంగా కొనసాగిస్తుండటంతో విషయాలు బయటకు పొక్కడం లేదు. నగర పరిధిలోని సీసీ కెమెరాల పుటేజీలను కూడా పోలీసు కంట్రోల్ రూము ద్వారా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో..
ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో జిల్లాలోని కౌంటర్ ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ గజదొంగ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఒక రోజంతా గుంటూరు నగరంలో, ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జీలో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని తెలిసింది. అయితే అతను ఏ పేరు, చిరునామా ఇచ్చాడనే విషయాలను పోలీసులు రహస్యంగా ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద ప్రాంతాల్లో వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు.
తెలంగాణలో భారీ చోరీ
మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో బంగారు దుకాణంలో అంతరాష్ట్ర దొంగలు చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు జిల్లా ఎస్పీలను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా నైట్ బీట్‌లను పటిష్టం చేయడంతోపాటు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ దొంగ రోజంతా నగరంలో ఉండటంతోపాటు, జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో కూడా సంచరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా నేరాలు, దొంగతనాలకు పాల్పడే ముఠా కన్ను జిల్లాపై పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కొనసాగించాలంటూ ఎస్పీలు అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment