సాక్షి, హైదరాబాద్ : ఆ ఏరియాలోకి ఓ కుటుంబం కొత్తగా వచ్చి నివాసం ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆ ఏరియాలోని ఒక వ్యక్తితో స్నేహం చేస్తారు. అతని ద్వారా ఆ ఏరియా వివరాలు అన్నీ తెలుసుకుంటారు. ఇంట్లో నుంచి అంతా వెళ్లిపోయాక.. ప్లాన్ ప్రకారం ఈ గ్యాంగ్‌ఇంట్లోకి చొరబడుతుంది. ఒకరేమో చెత్త కుండి వద్ద పిచ్చొడిలా కూర్చొని అందరిని గమనిస్తాడు. ఎవరైనా అటువైపు వస్తే సిగ్నల్ ఇస్తాడు. అంతే వారు పారిపోతారు. ఇదంతా వింటుంటే ఓ సినిమాలోని చోరీలా ఉంది కదూ..! కానీ ఇది నగరంలో వాస్తవంగా దొంగతనం తీరు.
మంగళవారం నార్త్ జోన్ పోలీసులు చోరి ముఠాను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా దొంగతనం చేసిన తీరును పై విధంగా వివరించారని చెప్పారు. ఇలా చోరీలు చేసిన సొమ్ముతో నెరెట్‌మెట్‌లో సింగిల్ బెడ్‌రూమ్‌ను కూడా కొనుగోలు చేశారు. ఈ విషయంపపై సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ..గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మహమ్మద్ సద్దాం అలీ, దంపతులు అన్వర్ అలీ, సలిమాతో పాటు మొత్తం 12 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 5కేజీ బంగారం, 12 కేజీల సిల్వర్, ఏడు లక్షల నగదు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని తెలిపారు.
డీసీపీ సుమతి మీడియాతో మాట్లాడుతూ.. ఈ చోరిల్లో మహిళలే కీ రోల్ పోషించారన్నారు. ముఠాలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులే ఉన్నారని తెలిపారు. వీరిపై 34కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. సాక్ష్యాలు దొరకుండా సీసీ టీవీ కెమెరాల కేబుల్స్ కట్ చేసి చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుల ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కేసును ఛేదించినట్లు డీసీపీ సుమతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment