
నిందితుడిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : నిత్యం జన సంచారం ఉండే మాదాపూర్ ప్రాంతం అది. ఓ ఐటీ మహిళా ఉద్యోగిని నడుచుకుంటూ అదే రహదారిపై తాను పనిచేసే కంపెనీకి వెళుతున్నారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే నిందితుడి చొక్కా పట్టుకొని గట్టిగా నిలదీయడంతో దాడికి యత్నించాడు. అయినా ఆమె భయపడలేదు. ధైర్యంగా ఎదురు దాడి చేసింది. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సికింద్రాబాద్ వారాసిగూడలో నివాసముంటున్న ఓ మహిళ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నాలుగు నెలల గర్భిణి అయిన ఆమె రోజూ మాదిరిగానే గురువారం రాత్రి 8 గంటలకు విధులకు వచ్చారు. అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భర్త తన కంపెనీ వద్దకు రావడంతో ఇద్దరూ కలిసి భోజనం చేసేందుకు సమీపంలోని వైఎస్సార్ చౌరస్తాకు వెళ్లారు. భోజనం అనంతరం భర్త ఇంటికి వెళ్లిపోగా ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ నడుచుకుంటూ సమీపంలో ఉన్న కంపెనీకి బయల్దేరారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడపై చేయి వేసి అసభ్యకరంగా తాకాడు.
దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆమె తలపైకి ఎత్తి చూడగా అతను అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనించారు. వెంటనే అతడిని వెంబడించి నిలదీసింది. సమాధానం చెప్పకుండా నిందితుడు ఆమెపై దాడికి దిగాడు. ఆమె ఏ మాత్రం భయపడకుండా.. అతడిపై ఎదురు దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో చుట్టటుపక్కల వారు గమనించి అతడిని పట్టుకున్నారు. వెంటనే బాధితురాలు 100కు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment