
ఉరవకొండ: ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో ఓ నర్సు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పీపీ యూనిట్‌లో విధులు నిర్వర్తిస్తున్న నర్సు తనకు సెలవు కావాలని ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణను బుధవారం కోరింది. హెడ్‌నర్సు అనుమతి తీసుకుని వెళ్లండని ఆయన సూచించారు. వైద్యాధికారి సెలవు మంజూరు చేయకుండా హెడ్‌నర్సు అనుమతి తీసుకోండని చెప్పడం ఏంటని మనస్తాపానికి గురైన నర్సు కాసేపటి తర్వాత ఆస్పత్రిలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. సిబ్బంది గుర్తించి వైద్యాధికారులకు సమాచారం అందించారు. సకాలంలో వైద్యం అందించడంతో నర్సుకు ప్రాణాపాయం తప్పింది.
నర్సుల మధ్య కోల్డ్‌వార్
ప్రభుత్వాస్పత్రిలో హెడ్‌నర్సు రమణమ్మకు, నర్సులకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. నర్సులకు హెడ్‌నర్సు సెలవులు మంజూరు చేయకుండా, నిరంతరం పని ఒత్తిడి పెంచి మానసిక క్షోభకు గురి చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నర్సుల మధ్య సమన్వయం లోపిస్తే వైద్యసేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.