కామాంధుల అరెస్టు  | Ongole Molestation Attack accused people is under police custody | Sakshi
Sakshi News home page

కామాంధుల అరెస్టు 

Published Mon, Jun 24 2019 4:12 AM | Last Updated on Mon, Jun 24 2019 5:28 AM

Ongole Molestation Attack accused people is under police custody - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న నిందితులు

ఒంగోలు/ సాక్షి, అమరావతి:  బాలికపై సామూహిక లైంగిక దాడి కేసును ఒంగోలు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. తల్లి మందలించిందని ఇల్లు విడిచి ఒంగోలు చేరుకున్న బాలికను ఆరుగురు యువకులు మభ్యపెట్టి గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు ఘటన వివరాలు వెల్లడించారు.  

నమ్మించి నయవంచన  
గుంటూరు జిల్లా నల్లచెరువుకు చెందిన బాలిక ఈ ఏడాది మేలో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తాతయ్యకు సాయంగా ఉండేందుకు వెళ్లింది. అదే సమయంలో ఒంగోలులో కారు డ్రైవర్‌గా పనిచేసే అమ్మిశెట్టి రాము అదే ఆసుపత్రికి ఓ పేషెంట్‌ను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరస్పరం ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.

ఈ విషయం తెలిసిన బాలిక తల్లి జూన్‌ 15న కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక రాముకు ఫోన్‌ చేసి, తాను ఒంగోలుకు వస్తున్నట్లు చెప్పింది. 16వ తేదీ రాత్రి 7 గంటలకు ఒంగోలు బస్టాండ్‌కు చేరుకుంది. రామును కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. బస్టాండ్‌లో కేఆర్‌ మొబైల్స్‌ దుకాణంలో పనిచేసే రెండు చేతులు లేని దివ్యాంగుడైన షేక్‌ బాజీని రాముకు కాల్‌ చేసేందుకు ఫోన్‌ ఇవ్వమని అభ్యర్థించింది.

షేక్‌ బాజీ ఫోన్‌ ఇచ్చినట్లే ఇచ్చి బాలికను మొబైల్స్‌ దుకాణం వెనుక భాగంలో ఉన్న సర్వీసింగ్‌ రూమ్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 17వ తేదీ అర్ధరాత్రి బాజీ, అతడి స్నేహితులైన ఆవుల శ్రీకాంత్‌రెడ్డి, మరో మైనర్‌ బాలుడు షాపులోకి వచ్చి బాలికతో మాట కలిపారు. రాము వద్దకు తీసుకెళతామని నమ్మబలికి ఓ గదిలోకి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బయటకు రాకుండా గదిలోనే నిర్బంధించారు. 19వ తేదీన బాజీ, శ్రీకాంత్‌రెడ్డి, మైనర్‌ బాలుడు బయటకు వెళ్లిపోయారు. తర్వాత మహేష్‌ అనే వ్యక్తి, మరో ఇద్దరు మైనర్లు వచ్చి బాధితురాలిపై లైంగిక దాడికి దిగారు.

ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు బాలికపై ఈ అరాచకం కొనసాగించారు. 22న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మైనర్లలో ఒకడు ఆమెను ఒంగోలు బస్టాండ్‌ వద్దకు తీసుకొచ్చి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయాడు. బస్టాండ్‌ ఆవరణలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ సంచరిస్తున్న బాధితురాలిని గమనించిన హోంగార్డు వెంకటేశ్వర్లు, హెడ్‌ కానిస్టేబుల్‌ సీతారామయ్య దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే శక్తి టీమ్‌ను అప్రమత్తం చేసి, బాలిక నుంచి విషయం రాబట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించారు.  

మైనర్లపై జువైనల్‌ చట్టం ప్రకారం చర్యలు  
బాలికపై లైంగిక దాడి కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, వారిలో ముగ్గురు మైనర్లు అని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ చెప్పారు. మైనర్లపై జువైనల్‌ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మేజర్లయిన మైనంపాడుకు చెందిన ప్రధాన నిందితుడు షేక్‌ బాజీ, యం.నిడమానూరుకు చెందిన రెండో నిందితుడు రావుల శ్రీకాంత్‌రెడ్డి, ఆరో నిందితుడైన మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లికి చెందిన పాత్ర మహేష్‌లను అరెస్టు చేశామన్నారు. బాలిక అదృశ్యమైనట్లు గుంటూరు లాలాపేట పోలీసుస్టేషన్‌లో ఈ నెల 19న కేసు నమోదైనట్లు వెల్లడించారు. నిందితులపై ‘పోస్కో’ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.  కాగా, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని డీజీపీ గౌతం సవాంగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

బాధితురాలికి మంత్రి బాలినేని పరామర్శ  
అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌తో మాట్లాడారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యాచార ఘటన గురించి ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు వివరాలు తెలియజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement