నెల్లూరు(క్రైమ్): తమకు ఇష్టం లేని పెళ్లిచేసుకుందని ఓ వివాహితను ఆమె తల్లిదండ్రులు, బంధువులే కిడ్నాప్ చేశారు. బాధిత భర్త ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి మహిళను భర్తకు అప్పగించారు. శుక్రవారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏఎస్‌పేటకు చెందిన వెంకటరమణ, కలువాయి మండలం చీపినాపికి చెందిన పావని ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరి కులాలు వేరుకావడంతో పావని తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారు సుమారు ఐదునెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి వారు ఏఎస్‌పేటలో నివాసం ఉంటున్నారు. వెంకటరమణ తన భార్యతో కలిసి గురువారం వీఆర్ ఐపీఎస్ (వీఆర్ కళాశాల)లో సర్టిఫికెట్లు తీసుకునేందుకు నెల్లూరుకు వచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న పావని తల్లిదండ్రులు, మేనమామ సాయంత్రం ఆటోలో వచ్చి కూరగాయల మార్కెట్ సమీపంలో వెంకటరమణపై దాడిచేసి పావనీని కిడ్నాప్ చేసి తమవెంట తీసుకెళ్లారు. బాధితుడు జరిగిన ఘటనపై చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ మధుబాబు బాబుకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఆయన ఎస్సై బలరామయ్యతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. రాపూరు మండలం తెగచర్లలో తన బంధువుల ఇంట్లో బందీగా ఉన్న పావనీని పోలీసులు విడిపించారు. ఆమెను కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, మేనమామలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. వివాహితను ఆమె భర్తకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును ఛేదించిన చిన్నబజారు పోలీసులను శుక్రవారం ఎస్పీ భాస్కర్‌భూషణ్, నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment