
కొండలో కుళ్లిన స్థితిలో చిన్నారి మృతదేహం , మూడవ భర్త రాజామణితో మంజుల
చెన్నై, వేలూరు: రెండేళ్ల చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని పారవేసి వెళ్లిన సంఘటన వేలూరు సమీపంలోని కమ్మవాన్‌పేటలో జరిగింది. వివరాలు.. కమ్మవాన్‌పేటలో మేట్టుమలై కొండపై మురుగన్ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడికి ఆదివారం పనులకు వెళ్తున్న కార్మికులకు దుర్వాసన రావడంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. పల్లంలో దాదాపు రెండేళ్ల చిన్నారి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఆర్కాడు సమీపంలోని తామనరై గ్రామానికి చెందిన తంగమణి అనే వ్యక్తి ఆర్కాడుకు తాయనూరు గ్రామానికి చెందిన చిన్నారి కనిపించడం లేదని చిన్నారి తల్లిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తాయనూరు గ్రామానికి చెందిన మంజుల(22)ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.
కొద్ది రోజుల క్రితం ఆమె రాజామణి అనే వ్యక్తిని మూడవ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. విచారణలో ఆమెపై అనుమానం రావడంతో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. మూడవ వివాహం చేసుకునేందుకు తన కుమార్తె అడ్డుగా ఉండడంతో హత్య చేసి కొండపై మృతదేహాన్ని వేసినట్లు తెలిపింది. మంజుల మొదటగా మేన మామను వివాహం చేసుకుంది. అనంతరం జిల్లాకు చెందిన పాండియన్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక ఆడ శిశువు జన్మించింది. తరువాత రెండవ భర్తను వదిలి పెట్టి చిన్నారితో పాటు తాయనూరులో జీవించేది. ఆ సమయంలో ఆర్కాడు సమీపంలోని వసనూరు గ్రామానికి చెందిన రాజామణితో పరిచయం ఏర్పడి ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు చిన్నారి అడ్డుగా ఉందని భావించి ఈనెల 22వ తేదిన చిన్నారిని హత్య చేశారు. కమ్మవాన్‌పేట కొండలో మృతదేహాన్ని పారవేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment