ఏడడుగుల బంధంతో ఏడాది క్రితం ఒక్కటయ్యారు. ఉన్నంతలో ఉన్నతంగా బతుకుదామనుకున్నారు.. మరికొన్ని రోజుల్లో ఇద్దరు కాస్తా ముగ్గురు కాబోతున్నారు.. ఆనందంగా గడిచిపోతున్న ఆ ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. నిండు గర్భిణి అయిన తన భార్యను చూడడానికి బైక్‌పై అత్తారింటికి బయల్దేరాడో భర్త.. దారెంట తన భార్యకు ఊసులెన్నో చెప్పాలని ఆలోచించుకున్నాడు. ఇంకో ఎనిమిది కిలోమీటర్లు చేరితే అత్తారిల్లు వస్తుందనగా బైక్ అదుపు తప్పి ఆ యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ‘నన్ను అన్యాయం చేసి పోయావా’ అని ఆ ఇంటి దీపం ఏడుస్తుంటే అక్కడున్న వారి మనసులు కలిచివేశాయి.
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిసంజు(31) మృతి చెందాడు. ఈఘటన ముథోల్ మండలంలోని విఠోలి, విఠోలి తండా గ్రామాల మధ్య మూలమలుపు వద్ద చోటుచేసుకుంది. సంజు కుంటాల మండలం కల్లూరు నుంచి ఆష్టా గ్రామానికి తన బైక్‌పై అత్తరింటికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని విఠోలి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న తుమ్మచెట్టును బైక్‌తో ఢీకొట్టాడు.
దీంతో పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో పడి మృతి చెందాడు. శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమచారాన్ని అందజేశారు. ఘటనా స్థలాన్ని ముథోల్ సీఐ రఘుపతి, ఎస్సై రాజు పరిశీలించారు. మృతుడి భార్య ఎనిమిది నెలల గర్భవతి అని కుటుంబీకులు తెలిపారు. ఘటనాస్థలం వద్ద కుటుంబీకులు, మృతుడి భార్య రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment