వివరాలను వెల్లడిస్తున్న నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, పక్కన సీఐలు
సాక్షి, నెల్లూరు: ఇళ్ల మధ్యలో గుట్టుగా పేకాట కేంద్రం నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి తొమ్మిది మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.05 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి జూదరుల వివరాలను వెల్లడించారు. పడారుపల్లికి చెందిన కె.వసుంధర్‌రెడ్డి క్రాంతినగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అందులో గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలంగా వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులను తీసుకువచ్చి పేకాట ఆడిస్తున్నాడు. వారి నుంచి ఆటకు రూ.5 వేలు వసూలు చేయసాగాడు. పేకాట కేంద్రంపై పోలీసు అధికారులకు సమాచారం అందింది. దర్గామిట్ట, చిన్నబజారు పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్‌లు ఎం.నాగేశ్వరమ్మ, ఐ.శ్రీనివాసన్‌లు తమ సిబ్బందితో కలిసి ఇంటిపై నిఘా ఉంచారు.
నిందితుల్లో స్పెషల్ పార్టీ పోలీసులు
మంగళవారం రాత్రి పోలీసులు పేకాట కేంద్రంపై దాడి చేశారు. నిర్వాహకుడు వసుంధరరెడ్డితోపాటు పేకాట ఆడుతున్న పడారుపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి, ఏసీనగర్‌కి చెందిన రామలింగారెడ్డి, మినీబైపాస్‌కు చెందిన రఘు, కోటమిట్టకు చెందిన అఫ్రోజ్, ఏకేనగర్‌కు చెందిన నాగరాజు, బుజబుజనెల్లూరుకు చెందిన చంద్రబాబు, స్పెషల్‌పార్టీ కానిస్టేబుల్స్ మహేష్, శ్రీహరిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,05,100 నగదు, మూడు మోటార్‌బైక్‌లు, 9 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిర్వాహకుడిపై గతంలో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉన్నట్లు తెలిపారు. జూదరులను అరెస్ట్ చేసిన ఇన్‌స్పెక్టర్లతోపాటు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ ఎస్సై షేక్ జిలానీబాషా, చిన్నబజారు ఏఎస్‌ఐ హరి, దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.ప్రసాద్, కానిస్టేబుల్స్ మహేంద్రనాథ్‌రెడ్డి, పురుషోత్తం తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
సమాచారం ఇవ్వండి
ప్రజలు తమ ప్రాంతాల్లో ఏక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా గుర్తిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో చిన్నబజారు, దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌లు ఐ.శ్రీనివాసన్, మిద్దె నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
అలగానిపాడు పొలాల్లో..
విడవలూరు: మండలంలోని అలగానిపాడు పొలాల్లో గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై విడవలూరు పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగబాబు మాట్లాడుతూ అలగానిపాడు పొలాల్లో వారంరోజులుగా పేకాట జరుగుతోందని సమాచారం వచ్చిందన్నారు. దీంతో సిబ్బందితో వెళ్లి దాడులు చేసినట్టుగా తెలిపారు. పోలీసుల రాకను పసిగట్టిన జూదరులు అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. అదే ప్రాంతంలో డైమండ్ డబ్బా ఆడుతున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మండలంలో జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment