ఆపిల్ ఉద్యోగి వివేక్ తివారి (ఫైల్ ఫోటో)
ఉత్తరప్రదేశ్ : లక్నో శుక్రవారం అర్థరాత్రి ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కారు ఆపలేదని, ఆపిల్ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగుడిని పోలీసు కానిస్టేబుల్ కాల్చేశాడు. వివేక్ తివారి అనే వ్యక్తి, ఐఫోన్ కంపెనీలో ఏరియా మేనేజర్. ఆఫీసు అయిపోయిన తర్వాత తన కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో, అతన్ని ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆపారు. కానీ వివేక్ వారికి పట్టించుకోకుండా.. తన కారును ఆపకుండా.. అలానే ట్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. వెంటనే వారిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తన గన్‌ను తీసి, వివేక్ పైకి కాల్పులు జరిపాడు. ఆ కాల్పులతో వివేక్ మృతిచెందాడు. శుక్రవారం అర్థరాత్రి 1.30 గంటలకు గోమతి నగర్ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో ఈ కాల్పుల సంఘటన జరిగింది.
ఈ సంఘటనపై లక్నో డీఎస్‌పీ మాట్లాడుతూ.. ‘ పోలీసులు ఆపినా ఆగకుండా.. డ్రైవర్ కారును క్రాస్ చేసి తీసుకు వెళ్లిపోయాడు. దీంతో అనుమానించిన ఒక పోలీసు కానిస్టేబుల్ అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో కారు డివైడర్‌కు ఢీకొని, ఆ వ్యక్తి తీవ్ర గాయాలు పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించాం. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది’ అని తెలిపారు. శవ పరీక్ష రిపోర్టులు వచ్చాక, అవసరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్‌పీ చెప్పారు. అయితే ఒకవేళ పోస్టు మార్టమ్ రిపోర్టులు ఆ మరణం, పోలీసు అధికారి జరిపిన బుల్లెట్ కాల్పుల వల్లేనని తెలిస్తే, అది హత్యానేరంగానే పరిగణించనున్నారు. కారు డ్రైవ్ చేసే సమయంలో వివేక్ తాగి ఉన్నాడో లేదో ఇంకా నిర్థారణ కాలేదు. బుల్లెట్ గాయంతో చనిపోయాడా? లేదా కాల్పులు జరిపిన తర్వాత కారు డివైడర్‌కు ఢీకొనడంతో, తలకు గాయమై చనిపోయాడా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. వివేక్ నడుపుతున్న కారులో అతనితో పాటు మరో మాజీ ఉద్యోగి కూడా ఉన్నట్టు తెలిసింది.
‘నా భర్తను కాల్చే హక్కు పోలీసుకు ఎక్కడిది. యూపీ సీఎం ఇక్కడికి రావాలి. నాకు జవాబు ఇవ్వాలి. పోలీసు కానిస్టేబుల్ జరిపిన కాల్పులతో నా భర్త తీవ్ర గాయపడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రాణాలు వదిలాడు’ అని వివేక్ తివారి భార్య కల్పన తివారి కన్నీరుమున్నీరైంది.
Comments
Please login to add a commentAdd a comment