కె.పురుషోత్తంరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ కె.పురుషోత్తంరెడ్డికి ఏసీబీ కోర్టు గురువారం 6 రోజుల పోలీసు కస్టడీ విధించింది. రూ.వందల కోట్లు అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు పురుషోత్తం ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. దీంతో పురుషోత్తం పరారు కాగా, అతని బినామీలు యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరికి కూడా కోర్టు పోలీసు కస్టడీ విధించింది. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఈనెల 16న ఏసీబీ కోర్టులో లొంగిపోగా జైలుకు తరలించారు. అదే రోజు ఏసీబీ అధికారులు కోర్టులో వారం రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కోర్టు అనుమతి నేపథ్యంలో ఏసీబీ అధికారులు కస్టడీ ఉత్తర్వులను చంచల్‌గూడ జైలు అధికారులకు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం నుంచి ఆరు రోజులపాటు పురుషోత్తంను విచారించనున్నారు. మరోవైపు యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను ఏసీబీ కోర్టులో హాజరు పరిచి తిరిగి జైలుకు తీసుకెళ్లారు.
రూ.60 కోట్ల మేర గుర్తింపు
ఈ కేసులో ఏసీబీ రూ.50 కోట్లకుపైగా బినామీ పెట్టుబడులను గుర్తించింది. నాలుగు కమర్షియల్ కాంపెక్సులు, వ్యవసాయ భూమికి సంబంధించి రూ.20 కోట్ల మేర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. పురుషోత్తం అల్లుడు చేపట్టిన విల్లాల నిర్మాణానికి సంబంధించి రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. కూతురికి ఇచ్చిన ఆభరణాలు, గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తుల విలువ మరో రూ.10 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు.
బినామీ శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట్
పురుషోత్తంరెడ్డికి ప్రధాన బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో రెండు రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. తనిఖీలకు వచ్చిన సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోనే ఉండటంతో.. ఏసీబీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో పురుషోత్తంరెడ్డి కూతురు వివాహం కోసం కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల బిల్లులు, రూ.86 వేల నగదు, ఇతర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment