బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం జరిగిన ఇల్లు (ఇన్‌సెట్‌లో) బ్యూటీషియన్ పద్మ(ఫైల్)
కృష్ణా, హనుమాన్‌జంక్షన్ రూరల్ : బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం కేసులో పలు అంశాలు మిస్టరీగా మారాయి. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధితురాలు పల్లె పద్మను పోలీసులు మంగళవారం కొద్ది సమయం విచారించారు. ఈ సందర్భంగా పద్మ పలు అంశాలను వెల్లడించింది. అయితే కత్తిపోట్లతో విపరీతంగా రక్తం పోవటం, మెడపై తీవ్ర గాయం కావటంతో పద్మ ఎక్కువ సేపు మాట్లాడలేదని తెలుస్తోంది. అసలు హత్యాయత్నం రాత్రి నూతనకుమార్, పద్మ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా రాబట్టేందుకు యత్నించారు.
నూతన్ ఒక్కడే దాడి చేశాడు..
ఈ నెల 23వ తేదీ రాత్రి జరిగిన తీవ్ర వివాదంలో పద్మను నూతనకుమార్ విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఆమెపై జరిగిన హత్యాయత్నంలో నూతనకుమార్ ఒక్కడే ఉన్నాడని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకూ హత్యాయత్నం ఘటనలో సుబ్బయ్య అనే మూడో వ్యక్తి ఉన్నట్లు వచ్చి ఊహాగానాలకు తెరపడ్డట్లైంది. తొలుత నూతనకుమార్ తీవ్రంగా కొట్టిన దెబ్బలతో ఓపిక పూర్తిగా నశించిందని, ఆ తర్వాతే తన కాళ్లు కట్టేసి, నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి కత్తితో దాడి చేశాడని ఆమె పేర్కొంది. సోమవారం పద్మ రెండు చేతులకు శస్త్రచికిత్సలు చేయటం, ఆపరేషన్ నిమిత్తం అనస్తీషియా ఇవ్వటంతో మత్తుతో ఉందని, నూతనకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మంగళవారం కుటుంబ సభ్యులు పద్మకు చెప్పారు.
ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారా?!
నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నూతనకుమార్, పద్మ మధ్య ఏడాదిగా తరుచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పెదపాడు, హనుమాన్‌జంక్షన్ పోలీస్ స్టేషన్లులో పద్మ ఫిర్యాదు కూడా చేసింది. నూతనకుమార్‌కు ఏలూ రులో ఉన్న ఇల్లు విక్రయించగా వచ్చిన రూ.35 లక్షలు వివాదానికి కారణమా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. కాగా 23వ తేది రాత్రి పద్మ తన భర్త వద్ద ఉంటున్న పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి నూతనకుమార్‌తో కలిసి ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పినట్లు భర్త సూర్యనారాయణ ఇప్పటికే మీడియాతో వెల్లడించాడు. ఇదే విషయాన్ని పద్మ కూడా ఆస్పత్రిలో పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకోవాల్సి వచ్చిందనే విషయం మిస్టరీగా మారింది. ఆత్మహత్యకు పద్మ అంగీకరించిందా? లేక నూతనకుమార్ బలవంతం చేశాడా? పద్మను ఆత్మహత్య చేసుకుందామని నమ్మించి ముందుగా మత్తు ఇచ్చి, ఆపై దాడి చేశాడా? అనే విషయాలు పద్మ పూర్తిగా కోలుకుంటేగానీ తెలిసే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment