కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి
సాక్షి, శాలిగౌరారం (తుంగతుర్తి) : భూతవైద్యం పేరిట మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంతోనే శాలిగౌరారం మండలం గురుజాల గ్రామానికి చెందిన వెంపటి శంకర్ దారుణహత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మండల పరిధిలోని గురుజాలలో ఈ నెల 4వ తేదీన వెలుగుచూసిన శంకర్ హత్యోందం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యోందంలో భాగస్వాములైన ఏడుగురు నిందితులను మంగళవారం నకిరేకల్‌లోని సీఐ కార్యాలయంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. గురుజాల గ్రామానికి చెందిన ఎడ్ల సాలమ్మ–చినవెంకన్న దంపతుల కుమారుడికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పలు ఆస్పత్రులో వైద్యం చేయించారు.
అయినా ఫలితం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడు వెంపటి యాదయ్యను సంప్రదించారు. ఈ క్రమంలోనే యాదయ్య, సాలమ్మల మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే కొంతకాలానికి సాలమ్మ అనారోగ్యం బారిన పడింది. ఆమెకు యాదయ్య భూతవైద్యం చేసినా ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో యాదయ్య ఇదే గ్రామానికి చెంది హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న భూతవైద్యుడు వెంపటి శంకర్‌ను సంప్రదించాడు. సాలమ్మను అతడికి పరిచయం చేసి భూతవైద్యం చేయాలని కోరాడు.
భూతవైద్యం చేసే క్రమంలో..
సాలమ్మకు భూతవైద్యం చేసేందుకు వెంపటి శంకర్ గత నెల 31న ఉదయం 9 గంటలకు గురుజాల గ్రామ సమీపంలోని మొండిఏనె వద్దకు చేరుకున్నాడు. అప్పటికే యాదయ్య, సాలమ్మలు అక్కడికి చేరుకున్నారు. అయితే సాలమ్మకు భూతవైద్యం చేసే క్రమంలో శంకర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తులైన యాదయ్య, సాలమ్మ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.
పథకం ప్రకారం..
తన పట్ల శంకర్ అసభ్యంగా ప్రవర్తించిన తీరును అప్పుడే అక్కడికి చేరుకున్న భర్త ఎడ్ల చినవెంకన్నకు వివరించింది. దీంతో అతను గురుజాల గ్రామానికి చెందిన బాకి రమేశ్, ఎడ్ల మారయ్య, గూని యా దయ్య, ఎడ్ల మారయ్యను అక్కడికి రప్పించాడు. ప్రథకం ప్రకారం అదును చూసి అందరూ కలిసి వెంపటి శంకర్ గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మూసీనది ఇసుకలో పాతిపెట్టి పారిపోయారు.
ఫోన్ కాల్‌డేటా ఆధారంగా..
కాగా, ఈ నెల 4వ తేదీన వెలుగుచూసిన శంకర్ హత్యోదంతంపై వీఆర్వో తిరుమలేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హతుడి జేబులో లభించిన మత్స్య సహకార సొసైటీ గుర్తింపు కార్డు ఆధారంగా గురుజాలకు చెందిన శంకర్‌గా గుర్తించారు. అతడి ఫోన్ కాల్‌డేటా ఆధారంగా యాదయ్యను అనుమానించారు. అప్పటినుంచి గ్రామానికి చెందిన ఏడుగురు పరారీలో ఉండడంతో వారే హత్య చేసి ఉంటారని భావించారు. అనుమానితులు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారని తెలిపారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు బైక్‌లు, ఏడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ పి.నాగదర్గప్రసాద్, ఎస్‌ఐ రాజు, ఏఎస్‌ఐ బండి యాదగిరి, స్టేషన్ రైటర్లు నజీర్, ముజీబ్, పోలీస్‌కానిస్టేబుల్స్ గురువారెడ్డి, చంద్రయ్య, అంజయ్య, టెక్నికల్ టీం జగన్, ఖలీల్, సుదర్శన్‌లను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment