తలలేని మొండం.. 3 రోజులుగా పోలీసులకు ముచ్చెమటలు.. అయినా! | Nalgonda Severed Head Case mystery Deepens Ss police Find No Clue | Sakshi
Sakshi News home page

తలలేని మొండం.. 3 రోజులుగా పోలీసులకు ముచ్చెమటలు.. అయినా!

Published Thu, Jan 13 2022 1:11 PM | Last Updated on Thu, Jan 13 2022 1:23 PM

Nalgonda Severed Head Case mystery Deepens Ss police Find  No Clue - Sakshi

సాక్షి, దేవరకొండ/చింతపల్లి : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో ఇటీవల వెలుగుచూసిన మతిస్థిమితం లేని జహేందర్‌ హత్యోదంతం కేసు పోలీసులకు జటిలంగా మారింది. కిరాతకులు జహేందర్‌ తలను తెగ్గోసి మహంకాళి అమ్మవారి పాదాల వద్ద పెట్టి మొండెం ఆచూకీ లేకుండా చేసిన విషయం విదితమే. కాగా, గడిచిన మూడు రోజులుగా ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నా బుధవారం నాటికి కూడా మొండెం ఆచూకీ లభ్యం కాలేదు. అయితే, హత్యోదంతం వెలుగుచూసిన నాటి నుంచి జహేందర్‌ తలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు.

మొండెం ఆచూకీ లభించేంత వరకు అతడి తలను కుటుంబ సభ్యుల కు ఇవ్వకూడదని, కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ పరిసరాల్లో నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలానికి చెందిన మాజీ నక్సలైట్‌ శ్రీనివాస్‌రెడ్డి దారుణ హత్యనే ఇందుకు ఉదాహరణ అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బాధిత కుటుంబానికి జహేందర్‌ తల ఇవ్వలేక.. అతడి మొండేన్ని కనుకొనలేక ఆ శాఖ యంత్రాంగం తల పట్టుకుంది.


చింతపల్లి : సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ

9 బృందాలు.. 170మంది పోలీసులు
కిరాతకుల సవాల్‌ను చాలెంజ్‌గా తీసుకున్న పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు జహేందర్‌నాయక్‌ కేసును ఛేదించేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. హతుడి మొండెం ఆచూకీ కనుగొనేందుకు 170మంది పోలీసులు తొమ్మిది బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. ఇబ్రంహీంపట్నం, తుర్కయాంజల్‌ మొదలుకుని చింతపల్లి మండల పరిసరప్రాంతాల్లోని చెట్టూపుట్ట వెతుకుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాగా, గత శనివారం 10గంటల సమయంలో దేవరకొండ నుంచి శేరిపల్లి వెళ్లే దారి పక్కన నిలిపి ఉంచిన కారు ఎవరిదన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సంప్రదాయం ప్రకారం జహేందర్‌ అంత్యక్రియలు నిర్వహించుకుంటామని, అతడి మొండేన్ని కనుగొని పూర్తి మృతదేహాన్ని అప్పగించాలని బాధిత కుటుంబం పోలీసు అధికారులను వేడుకుంటోంది. 

త్వరలోనే ఛేదిస్తాం.. సహకరించండి
జహేందర్‌ నాయక్‌ హత్య కేసును ఛేదించేందుకు తమకు సహకరించాలని ఎస్పీ రెమా రాజేశ్వరి బాధిత కుటుంబ సభ్యులను కోరారు. జహేందర్‌నాయక్‌ తల లభ్యమైన చింతపల్లి మండలం విరాట్‌నగర్‌ సమీపంలోని శ్రీ మెట్టు మహంకాళి దేవాలయాన్ని బుధవారం ఎస్పీ పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. కేసు సంక్లిష్టంగా ఉందని, నిందితులు చిన్న క్లూ కూడా వదలేదు అన్నట్లు తెలిసింది. కేసు ఛేదనకు అనునిత్యం శ్రమిస్తున్నామని, మీకు ఎవరిమీదైనా అనుమానం ఉన్నా, గతంలో అనుకోని ఘటనలు జరిగి ఉంటే చెప్పాలని కోరినట్లు సమాచారం. ‘‘ఒకటి రెండు రోజుల్లో కేసును కొలిక్కి తెస్తామని.. సహకరించాలని ఎస్పీ  కోరినట్లు తెలిసింది. ఎస్పీ వెంట సీసీఎస్‌ డీఎస్పీ మొగి లయ్య, నాంపల్లి సీఐ సత్యం, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement