
అనంతపురం టౌన్: కొడవీడు ఎక్స్‌ప్రెస్ రైల్లోంచి గర్భిణిని తోసివేసిన దుండగుడు రాజేంద్రన్‌ను అరెస్టు చేసినట్లు గుంతకల్ డివిజన్ రైల్వే ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్ తెలిపారు. బుధవారం నగరంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో గల కోదండరామ కల్యాణమంటపంలో ఏర్పాటు చేసిన వికర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో నివాసముంటున్న వేలాయుధం రాజేంద్రన్ రైలులో దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడు.. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే పలు రైలు దొంగతానాల్లో జైలు జీవితం గడిపాడు. అక్కడి పోలీసుల హిట్ లిస్టులోకి ఎక్కడంతో రాజేంద్రన్ తన మకాం ఏపీకి మార్చాడు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జరిగిన పలు కేసుల్లో రాజేంద్రన్ నిందితుడు.గత ఏడాది నవంబర్ 20న ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైల్లో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపాన విజయలక్ష్మీ అనే మహిళను రైలు నుంచి తోసివేస్తుండగా ఆమె సోదరుడు ప్రతిఘటించడంతో రాజేంద్రన్ తప్పించుకుని పారిపోయాడు. నవంబర్25న పెనుకొండ రైల్వేస్టేషన్ వద్ద కదులుతున్న కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైల్లో నుంచి నిఖిత అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను తోసేశాడు.
ఆమె దగ్గర ఎలాంటి బంగారు నగలు లేకపోవడంతో మొబైల్ ఫోన్ లాక్కుని ఉడాయించాడు. డిసెంబర్ 18న కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు జంగాలపల్లి రైల్వే స్టేషన్‌లో కదులుతుండగా బి–1 బోగీలో ప్రయాణం చేస్తున్న శిరీష అనే వివాహితను తోయడంతో అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది రక్షించారు. అదే బోగిలో కుటుంబ సభ్యులతో ప్రయాణం సాగిస్తున్న దివ్యశ్రీ అనే ఏడు నెలల గర్భిణి ధర్మవరం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో వాష్‌రూంకు రాగా.. అప్పటికే అక్కడ మాటువేసిన రాజేంద్రన్ గొల్లపల్లి రైల్వే గేట్ సమీపంలో ఆమెను కిందకు తోసేశాడు. అనంతరం అతడూ రైలులోంచి దూకి.. దివ్యశ్రీ వద్దనున్న బంగారు నగలను దోచుకుని ఉడాయించాడు. దొంగలించిన బంగారు నగలను రాజేంద్రన్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు ఉంచాడు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు, జీఆర్‌పీఎఫ్ అధికారులు గాలింపు ముమ్మరం చేసి 15 రోజుల్లోనే నిందితుడు రాజేంద్రన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ మోహన్‌ప్రసాద్, హనుమంతు, రాజశేఖర్‌రెడ్డి, నజీరుద్దీన్, షణ్ముఖానంద, చంద్రశేఖర్‌తోపాటు పలువురిని రైల్వే ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జీఆర్‌పీ ఎస్పీ రమేష్‌బాబుతోపాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment