స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా పొందుపరుచుకోవడానికి ఉద్దేశించిన ‘లొకంటో.కామ్’ అక్రమాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఈ సైట్‌ను వేదికగా చేసుకుని నిలువునా ముంచే మోసగాళ్ల సంఖ్య పెరుగుతోంది. దానిద్వారా సైబర్ నేరస్తులు వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. గడిచిన నెలరోజుల్లో మూడు ఉదంతాలు బయటపడడం కలకలం రేపుతోంది. వెలుగులోకి రాని వ్యవహారాలు చాలానే ఉన్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. దీనిద్వారా మోసపోయినవారు బయటకు చెప్పుకోలేక గుట్టుగా ఉంటున్నట్టు భావిస్తున్నారు. నేరస్తులు ఇంటర్‌నెట్ నుంచి తీసిన జూనియర్ ఆర్టిస్టుల ఫొటోలను పోస్ట్ చేసి ‘ఆసక్తి’ ఉంటే తమను సంప్రదించాల్సిందిగా వాట్సప్ నంబర్లు ఇస్తున్నారు. ఎవరన్నా ఫోన్ చేస్తే.. ఆడవారే మాట్లాడుతున్నారు. తాము ‘అన్నింటికీ’ సిద్ధమని ఉచ్చులోకి దింపుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా పొందుపరిచేందుకు ఉద్దేశించిన ‘లొకంటో.కామ్’ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఈ సైట్‌ను వేదికగా మోసాలకు పాల్పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత నెల రోజుల్లోనే మూడు ఉదంతాలు వెలుగులోకి వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. వివిధ కారణాల నేపథ్యంలో గుట్టుగా ఉండి పోతున్న వారి సంఖ్య పదుల్లో ఉంటుందన్నారు. ఉత్తరాదికి చెందిన వారే సూత్రధారులుగా ఈ నేరాలు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా వ్యభిచారం పేరుతో...
ఈ సైట్‌ను దుర్వినియోగపరుస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా వ్యభిచార దందాను ఎంచుకుంటున్నారు. ఇంటర్‌నెట్ నుంచి సంగ్రహించిన, పరిచయస్తులైన వారితో పాటు జూనియర్ ఆర్టిస్టుల ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. వీటితో పాటు తమ సెల్ నెంబర్లు ఇస్తూ ‘ఆసక్తి’ ఉంటే కాల్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే అందమైన గొంతుతో ఉండే యువతులు, స్త్రీలు మాట్లాడుతున్నారు. పోస్ట్ చేసిన ఫొటోలో ఉన్నది తామేనని, అన్నింటికీ సిద్ధమే అంటూ పూర్తిగా ఉచ్చులోకి దింపుతున్నారు. కలుసుకోవాలంటే కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు నిస్తున్నారు. వీటిలో డబ్బు పడిన తర్వాత సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని నిండా ముంచుతున్నారు.
వాట్సాప్ కాల్స్... పేటీఎం పేమెంట్స్...
ఈ మోసగాళ్ల తరఫున మాట్లాడుతున్న మరికొందరు యువతులు, మహిళలు మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ప్రకటనల్లో ఇస్తున్న ఫోన్ నెంబర్లకు ‘ఓన్లీ వాట్సాప్’ అంటూ పొందుపరుస్తున్నారు. వీరిని ఎవరైనా సంప్రదించాలన్నా... వీరు ఎవరితోనైనా మాట్లాడాలన్నా అన్నీ వాట్సాప్ కాల్స్ ద్వారానే. ఈ కాల్స్ చేయడానికి ఫోన్‌లో సిమ్ ఉండాల్సిన అవసరం లేకపోవడం, కేవలం నెట్ ఉంటే సరిపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా వీరు ఎక్కడ నుంచి కాల్స్ చేస్తున్నారన్నది గుర్తించడం సాధ్యం కాదు. మరోపక్క బాధితుల నుంచి తీసుకునే నగదు కూడా బ్యాంకు ఖాతాల్లో వేయించుకుంటే పోలీసులకు ఆధారాలు లభించే అవకాశం ఉండటంతో పే టీఎం యాప్ వినియోగిస్తున్నారు. దీనిని కూడా బోగస్ వివరాలతో యాక్టివేట్ చేసుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు.
నెలలో మూడు ఉదంతాలు...
కీసర ప్రాంతానికి చెందిన గణేష్ లొకంటో.కామ్‌ను ‘ఆశ్రయించాడు’. సినీ తారలతో పాటు అనేక ఫొటోలను ఇందులో పోస్ట్ చేసిన గణేష్ వీరంతా కాల్‌గరల్స్ అంటూ పేర్కొని, ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ డబ్బు డిమాండ్ చేశాడు. ఓ క్యారెక్టర్ నటి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గణేష్ కటకటాల్లోకి చేరాడు.
బెంగళూరుకు చెందిన ఓ యువతి బేగంపేట చిరునామాతో లొకంటోలో పోస్ట్ చేసింది. అందులో తాను అన్ని రకాల మసాజ్‌లు చేస్తానని, ఆసక్తి ఉన్న వారు వాట్సాప్‌లో సంప్రదించాలని కోరింది. వారి నుంచి బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయించుకుని బేగంపేటకు చెందిన తప్పుడు చిరునామా ఇచ్చింది. అనేక మంది ఈమె వల్లో పడి మోసపోయారు.
లొకంటో మోసాలకు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో నగర పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ స్ట్రింగ్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యాడు. ఓ ప్రకటన జారీ చేసిన వారితో సంప్రదింపులు జరపడంతో పాటు బేరసారాలు పూర్తి చేశాడు. చివరకు రూ.10 వేలు పేటీఎం ద్వారా బదిలీ చేసి ట్రాక్ చేయాలని ప్రయత్నించాడు. ఆ ఫోన్ నెంబర్, పేటీఎం ఉన్న నెంబర్ సైతం బోగస్‌విగా తేలడంతో దర్యాప్తు ముందుకు వెళ్లలేదు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
లోకంటో సైట్ కేంద్రంగా జరుగుతున్న నేరాలు ఇటీవల పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేయడంతో పాటు వీటికి చెక్ చెప్పడానికి చర్యలు తీసుకుంటున్నాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. బాధితుల బలహీనతే ఇలాంటి నేరగాళ్లకు క్యాష్‌గా మారుతోంది. అనేక మంది తాము మోసపోయామనే విషయాన్నీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. లోకంటోలో వ్యభిచారం పేరుతో వచ్చే ప్రకటనలు పూర్తి మోసపూరితం అని గుర్తుంచుకోవాలి.
– జి.చక్రవర్తి, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్స్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment