
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్‌ను కలవాలంటూ ఓ యువకుడు దౌర్జన్యంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించడమే కాక శ్రీకాంత్‌పై దాడికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన బి.వెంకటేశ్(29) జూబ్లీహిల్స్ రోడ్‌నం. 10లో వ్యాక్స్‌బేకరీ సమీపంలో నివసిస్తున్నాడు. పదేళ్లుగా జూబ్లీహిల్స్‌లోని పలువురు ప్రముఖుల నివాసాల్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. హీరో శ్రీకాంత్ అంటే వెంకటేశ్‌కు వల్లమాలిన అభిమానం. మూడేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నం. 76లోని శ్రీకాంత్ ఇంట్లో కూడా మూడు నెలల పాటు వంట మనిషిగా పనిచేశాడు. అయితే వెంకటేశ్ పనితీరు సరిగా లేకపోవడం.. సైకోలా ప్రవర్తిస్తుండటంతో అతనిని విధుల నుంచి తొలగించారు. అనంతరం జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లో ఓ రాజకీయ నాయకుని నివాసంలో పనికి కుదిరాడు. అయితే శ్రీకాంత్ తరచూ తనకు కలలో వస్తుంటాడని, కలవడానికి ఎన్నిసార్లు వెళ్లినా అనుమతించడం లేదని ఆరోపిస్తూ శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీకాంత్ ఇంటి వద్ద హల్‌చల్ చేశాడు.
వెంకటేశ్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా వాచ్‌మెన్ అడ్డుకోవడంతో అతనిని నెట్టేసి అక్కడే ఉన్న కర్రతో బీఎండబ్ల్యూ కారు(ఏపీ 10ఏఎస్ 0789), ఫోర్డ్ కారు(ఏపీ 09 సీఎల్ 9414) అద్దాలు ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి చొచ్చుకెళ్లాడు. అడ్డువచ్చిన డ్రైవర్ మోహన్‌ను నెట్టేసి శ్రీకాంత్ బెడ్‌రూమ్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మేడ మీద నుంచి కిందకు దిగుతున్న శ్రీకాంత్.. ఎవరు నువ్వని ప్రశ్నిస్తుండగా మెట్ల మీద నుంచి ఆయనను తోసేశాడు. అయితే శ్రీకాంత్ అప్రమత్తంగా ఉండటంతో తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాంత్ సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అయితే వారిని కూడా తోసేసి మళ్లీ లోనికి వెళ్లేందుకు వెంకటేశ్ ప్రయత్నించాడు. చివరికి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటన జరిగిన సమయంలో శ్రీకాంత్ భార్య ఊహతో పాటు పిల్లలెవరూ ఇంట్లో లేరు.
నాలో మరో వ్యక్తే చేశాడు..
మానసిక పరిస్థితి సరిగాలేక కొంత కాలంగా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుండటంతో చాలా మంది వెంకటేశ్‌ను విధుల్లో నుంచి తొలగించారు. అయితే శ్రీకాంత్‌పై మితిమీరిన అభిమానంతో ఎలాగైనా ఆయనను కలవాలని వెంకటేశ్ మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా తాను కలవడానికి వచ్చానని ఒకసారి, తనలోని మరో వ్యక్తిని శ్రీకాంత్ ఇక్కడికి రప్పించాడని పొంతన లేని జవాబులు ఇవ్వడంతో పోలీసులు తలపట్టుకున్నారు. తనలో అపరిచితుడు దాగి ఉన్నాడని, వాడే బయటకు వచ్చాడని, అసలు వెంకటేశ్ రాలేదంటూ మరో కట్టుకథ చెప్పాడు. శ్రీకాంత్ ఇంట్లో అరగంట పాటు హల్‌చల్ చేసి ఆయనను తోసేయడమే కాకుండా.. అడ్డువచ్చిన వాచ్‌మెన్, డ్రైవర్, వంటవారిపై దాడి చేసిన ఘటనలో వెంకటేశ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.