
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో గతంలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన బాలీవుడ్ నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, దుష్యంత్ సింగ్, నీలమ్ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణ జింకలను వేటాడారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. జోధ్‌పూర్ కోర్టు గతేడాది ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది.
అయితే.. ఈ కేసులో సల్మాన్‌ది ఎంత తప్పు ఉందో అతనితో పాటు ఉన్న వారిది కూడా అంతే తప్పు ఉందని భావిస్తూ జోధ్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రేలకు నోటీసులు జారీ చేసింది. 1998 నాటి ఈ కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్‌ని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షపడిన తర్వాత సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment