సాక్షి, గుంటూరు : సంచలనం సృష్టించిన ‘రాజధానిలో జ్యోతి హత్య’ కేసులో జ్యోతి మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం పూర్తయింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు...పోస్ట్ మార్టంలో ఏం తేలిందో చెప్పాలంటూ డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రీ పోస్ట్‌మార్టం చేసిన వైద్యుడిని జ్యోతి బంధువులు అడ్డుకున‍్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జ్యోతి బంధువులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
కాగా అంతకు ముందు జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం చెయ్యకుండానే పోలీసులు చేశామని చెబుతున్నారంటూ కుటుంబసభ్యులు గురువారం తాడేపల్లి మహానాడు శ్మశాన వాటిక వద్ద ఆందోళన చేపట్టారు. జ్యోతి మృతదేహంపైన పోస్టుమార్టం చేసిన ఆనవాళ్లు కనిపించటం లేదంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం జరగాలంటూ జ్యోతి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జ్యోతి కుటుంబసభ్యులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సీఐ బాలాజీని కాపాడటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ వారు ఆందోళన చేపట్టారు.
ఇదిలా ఉండగా తన చెల్లెల్ని అత్యాచారం చేసి హత్య చేశారని, ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు స్పందించడం లేదని జ్యోతి సోదరుడు ప్రభాకర్ వాపోయాడు. కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. పోస్టుమార్టం సైతం తూతూ మంత్రంగా చేశారన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగళగిరి సీఐ బాలాజీని సస్పెండ్‌కు సిఫార్సు చేయడంతోపాటు, ఎస్‌ఐ బాబూరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (‘జ్యోతి వాచ్, బట‍్టలు కావాలన్నారు’)
Comments
Please login to add a commentAdd a comment