టెన్షన్‌ టెన్షన్‌..! | Relatives Conflict on Commission Issue Chittoor | Sakshi
Sakshi News home page

టెన్షన్‌ టెన్షన్‌..!

Published Mon, May 13 2019 10:13 AM | Last Updated on Mon, May 13 2019 10:13 AM

Relatives Conflict on Commission Issue Chittoor - Sakshi

ఇరుగుళం ఎస్సీకాలనీలో విచారణ చేస్తున్న సీఐ, ఎస్‌ఐతో పాటు పోలీసులు

సత్యవేడు :ఆ ఊరిలో అంతా బంధువులే.. కొందరు దాయాదులు.. మరికొందరు తమ బిడ్డలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న వాళ్లే.. అంతేకాదు.. పక్కపక్కనే ప్రశాంతంగా నివాసాలు ఉంటున్నారు. నిద్రలేస్తే మామ.. అత్తా.. అన్న.. అక్క.. అంటూ బంధుత్వాన్ని గుర్తుచేసుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ.. ప్రశాంతంగా తమకున్నదాంతో పాటు చిన్నచిన్న కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ప్రశాంతంగా ఉన్న పల్లెలో పాలకపక్షానికి చెందిన ఓ నేత జోక్యంతో కమీషన్ల చిచ్చు రాజుకుంది. ఆ నేత కమీషన్లను బూచిగా చూపడంతో పాటు కాలనీలో రెచ్చగొట్టే మాటలతో పచ్చటి పల్లెను రెండు వర్గాలుగా చీల్చి వివాదాలకు ఆజ్యం పోశారు. చివరికి మానవ్వతాన్ని మరచి.. ఎన్నడూ లేనివిధంగా కత్తులతో, కర్రలతో దాడులు చేసుకునే దుస్థితికి వారిని తీసుకువచ్చారు. దాంతో ఇరుగుళం ఎస్సీకాలనీలో ప్రశాంత వాతావరణం కరువైంది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలనీ మొత్తం పోలీసు బలగాలతో నిండిపోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

కత్తులు, కర్రలతో దాడులు..
రెండు వర్గాలకు చెందినవారు కత్తులు, కర్రలతో శనివారం రాత్రి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో బాలకృష్ణ అనే వ్యక్తి కత్తిపోటుకు గురయ్యాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం శనివారం రాత్రే చెన్నైలోని జనరల్‌ హాస్పిటల్‌(జీహెచ్‌)కు తరలించారు. మరోవైపు వారితోపాటు జీవమ్మ, బాల, శేఖర్, అజిత్‌ తదితరులు చిన్నపాటి గాయాలతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి భద్రతగా పెద్ద ఎత్తున పోలీసులు ఆస్పత్రి చుట్టూ మోహరించారు. దాంతో ఆస్పత్రి వద్ద టెన్షన్‌ నెలకొంది.

పోలీసుల నీడలో ఇరుగుళం ఎస్సీకాలనీ..
శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన దాడితో శ్రీసిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ విమలకుమారి నేతృత్వంలో 11మందిని అదువులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ సుబ్బారెడ్డితోపాటు పెద్ద ఎత్తున శ్రీసిటి పోలీసులే కాకుండా చిత్తూరు నుంచి మరో 40మంది ప్రత్యేక భద్రతా సిబ్బంది ఇరుగుళం ఎస్సీకాలనీలో ఉద్రిక్తతను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీకాలనీలో 144 సెక్షన్‌ తరహాలో ఎక్కడా జనం గుంపులు గుంపులుగా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా దాడులకు సంబంధించి రెండు వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

అసలేం జరిగింది..?
సత్యవేడు మండలంలోని ఇరుగుళం ఎస్సీకాలనీ శ్రీసిటీ పారిశ్రామికవాడ ప్రాంతంలో ఉంది. శ్రీసిటీ పరిధిలో పదికి పైగా పల్లెలున్నాయి. దాంతో ఆ ప్రాంతంలో కొత్త కర్మాగారం ఏర్పాటు చేస్తే.. ఆ సమీపంలోని గ్రామానికి చెందిన వ్యక్తులకు పరిశ్రమకు చెందిన కొన్ని నిర్మాణపనులు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ పనుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ గ్రామానికి చెందిన అందరికీ సమానంగా పంచాల్సి ఉంది. అదే తరహాలో గతేడాది బావెంటో, టొరయ్‌ అనే పరిశ్రమలు ఇరుగుళం సమీపంలో స్థాపించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అ పరిశ్రమల నిర్మాణపనులు స్థానికులకు అప్పగించాల్సి ఉంది. అయితే పాలపక్షానికి చెందిన సత్యవేడు నేత... తమకు ఉన్న సిఫార్సుతో ఆ పనులు దక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పరిశ్రమల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దాంతో వారు స్థానికంగా ఉంటున్న ఎస్సీకాలనీలోని నలుగురు వ్యక్తులకు నిర్మాణపనులు చేయడానికి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఆమేరకు పనులు పూర్తి చేసిన ఆ నలుగురు వాటి ద్వారా సుమారు రూ.1.50కోట్ల మేరకు వచ్చిన ఆదాయాన్ని ఆ ఎస్సీకాలనీలో నివాసం ఉంటున్న వారికి పంచాల్సి ఉంది. అయితే ఆలా చేయకుండా, వారి అకౌంట్‌లో పడిన మొత్తాన్ని స్వాహా చేశారనే విమర్శలు వెల్లువెత్తడంతో పలువురు వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా శ్రీసిటీ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో రెండు రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పనులు చేసిన వారు ఓ వర్గంగా, ప్రశ్నించిన వారు మరోవర్గంగా మారారు. దాంతో ఒకరిపై ఒకరు శనివారం రాత్రి దాడులు చేసుకోవడంతో ఎస్సీకాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement