బరితెగిస్తున్న బ్లేడ్‌ బ్యాచ్‌ | Blade Batch Attack on Ralway Ticket Collector | Sakshi
Sakshi News home page

బరితెగిస్తున్న బ్లేడ్‌ బ్యాచ్‌

Published Mon, Apr 22 2019 11:21 AM | Last Updated on Mon, Apr 22 2019 11:21 AM

Blade Batch Attack on Ralway Ticket Collector - Sakshi

రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో నిందితులు ,దాడిలో గాయపడిన టీటీఈ ఉమామహేశ్వరరావు

బ్లేడ్‌ బ్యాచ్‌లు జిల్లాలో బరితెగిస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమైన జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. రాత్రి వేళ కొందరు యాత్రికులు స్టేషన్లలో సేదదీరుతుంటారు. ఈ పరిస్థితులను బ్లేడ్‌ బ్యాచ్‌లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. చోరీల కోసం దాడులకు తెగబడుతున్నాయి. శనివారం రాత్రి ఇద్దరు ఓ రైల్వే టీటీఈపైనే కత్తితో దాడిచేశారు. ఈ సంఘటన తెలిసిన ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.

చిత్తూరు అర్బన్‌: గతనెల 22వ తేదీ నగరి రైల్వే స్టేషన్‌లో బరితెగించిన గుర్తుతెలియని వ్యక్తులు నలుగురిపై బ్లేడులతో దాడులకు పాల్పడ్డారు. భిక్షగాళ్లని కూడా చూడకుండా బ్లేడులతో దాడులుచేసి ఉన్న డబ్బును లాక్కుని పారిపోయారు.     తీవ్ర రక్తస్రావం మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందిన తరువాత నలుగురూ కోలుకున్నారు. ఈ దాడులు చేసింది ఎవరనేది ఇప్పటివరకు తెలియరాలేదు.

ఇప్పుడు..
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ఇద్దరు సైకోలు ప్రయాణికుల్లా నటించారు. ఇక్కడున్న రైల్వే ప్లాట్‌ఫాం వంతెనపై పడుకుని ఉన్న ఓ ప్రయాణికుడి జేబులో డబ్బులు చోరీ చేస్తుండగా విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న టికెట్‌ కలెక్టర్‌ ఉమామహేశ్వరరావు అనుమానం వచ్చి ప్రశ్నించారు. వెంటనే జేబుల్లో ఉన్న బ్లేడులను తీసుకుని విచక్షణారహితంగా ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ తరహా దాడులకు పాల్పడుతున్న నింది తులు బ్లేడు బ్యాచ్‌కు చెందిన వారుగా నిర్ధారణ అయ్యిం ది. రేణిగుంటలో జరిగిన దాడిలో నిందితులు చెన్నైకి చెందిన వెంకటేష్, విజయన్‌గా గుర్తించారు. అయితే ఇద్దరు నిందితులను పట్టుకోవడంతో ఇంతటితో ఈ తరహా ఘటనలకు కళ్లెం పడ్డట్లుకాదని పోలీసులు చెబుతున్నారు. బ్లేడ్‌ బ్యాచ్‌లో ప్రస్తుతం పట్టుబడింది ఇద్దరు నిందితులే. ఇంకా ఈ ముఠాలో ఎందరు ఉన్నారు..? వీరి స్థావరం? వీరి లక్ష్యం ఏమిటని ఇద్దరు నిందితులను విచారించిన పోలీసులు పలు విషయాలను రాబట్టారు.

దురలవాట్లే వ్యసనం
ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల బ్లేడుబ్యాచ్‌లు వీరంగం సృష్టించాయి. విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు ప్రాంతాల్లో దాదాపు 13 మంది బ్లేడ్‌బ్యాచ్‌ నిందితులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కేవలం చిల్లర డబ్బుల కోసం, వ్యసనాల కోసమే వీరు దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగడానికి, గంజాయి సేవించడానికి డబ్బులు కావాల్సి రావడంతో రద్దీ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే ప్రయాణికులపై వీరు దాడులకు పాల్పడుతుంటారు.

ఒక్క చోట ఉండరు
ఇప్పటికే పట్టుబడ్డ బ్లేడ్‌బ్యాచ్‌ నిందితుల్లో ఏ ఒక్కరికీ స్థిరమైన చిరునామా అంటూ లేదు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ దోపిడీలు చేస్తూ వీరు జీవనం సాగిస్తుంటారు. భార్య, పిల్లల్ని వీరితో పాటు ఎక్కడకూ తీసుకురారని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. అయితే వీరిని అరెస్టుచేసి రిమాండుకు పంపిన తర్వాత  కుటుంబ సభ్యులకు విషయం తెలిస్తే జామీను ఇవ్వడానికి మాత్రం బయటకొస్తారు. కోర్టుల్లో జరిగే విచారణకు హాజరుకాకుండా మరో ప్రాంతానికి వెళ్లిపోతారు. న్యాయస్థానాల్లో వీరిపై చాలా వరకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

లోతుగా విచారిస్తే..
రేణిగుంటలో పట్టుబడ్డ నిందితులు ఇద్దరిలో ఒకరి మానసిక పరిస్థితి బాలేదని పోలీ సులు గుర్తించారు. అయితే వీరి అలవాట్లు, ఎక్కడెక్కడ ఉంటారు, వీరి ముఠా నాయకుడు ఎవరైనా ఉన్నారా, బెయిల్‌ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించే వ్యక్తి ఎవరు అనే కోణాల్లో పోలీసులు విచారిస్తే ఆసక్తికర విషయాలు బయటపడుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement