
చికిత్స పొందుతున్న రోజా
చిత్తూరు,గంగాధరనెల్లూరు: వరకట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేయడంతో వివాహిత తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మండలంలోని పెద్దకాల్వ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల కథనం మేరకు.. ఐరాల మండలం సంతగేటుకు చెందిన రోజా కు, పెద్దకాల్వకు చెందిన పవన్‌కుమార్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నాడు. భర్త పవన్‌కుమార్, మామ జ్ఙానప్రకాష్ (ఏఎస్‌ఐ), అత్త భానుమతి తరచూ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వారు బుధవారం కత్తులతో ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై ఎస్‌ఐ విక్రమ్ వివరణ ఇస్తూ మూడు రోజులుగా భార్య, భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.