
సాక్షి, అచ్చంపేట: గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అచ్చంపేటలోని ఓనగల దుకాణంలో చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకుపోయారు. వెళ్తూ వెళ్తూ తమను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను సైతం ఎత్తుకెళ్లిపోయారు..
వివరాల్లోకి వెళ్తే అచ్చంపేట ఆలీ ఆభరణాల దుకాణంలో గత రాత్రి భారీ చోరీ జరిగింది. షాప్ వెనుకపైపు ఉన్న తలుపు పగలకొట్టి లోపలకి ప్రవేశించిన దొంగలు, సుమారు యాభైలక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు పెద్దమెత్తంలో నగదును దోచుకెళ్లారు. పారిపోతూ పోలీసులకు పట్టుపడకుండా ఉండేందుకు అతితెలివి ప్రదర్శించారు. దుకాణం భద్రతకోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తలుపు తెరచి చూసిన యజమానులు విషయం అర్థమై అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ చోరీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.